ప్రకృతి ద్వారా ఏర్పడిన సహజ వనరుల తోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యమన్న విషయం తెలియనిది కాదు. గాలి, నేల, నీరు ఈ మూడు అత్యుత్తమ వనరులగా కొలిచే సంస్కృతి మనది. కానీ నేటి ఆధునిక కాలంలో నీరు ప్రాణాధారమయ్యింది. ఎక్కడ చూసినా నీటి సమస్య ప్రజల్ని వెంటాడుతున్నది. నానాటికీ తరిగిపోతున్న ఉపరితల జలరాశులను కళ్లారా చూస్తున్న మనిషి ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ మార్పులకు భూగర్భ, ఉపరితల జలాలు ఆధారమనే విషయం గుర్తించకపోతే భవిష్యత్‌లో ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు. భూగర్భ జలనిధులు తరిగిన కొద్దీ నీటి కొరత పెరిగి, నీటి నాణ్యత తగ్గుతుంది. 2023-24లో నిర్వహించిన ”యూయన్ వాటర్ కాన్ఫరెన్స్” నేపథ్యంలో భూగర్భ జల అంశానికి మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రజల్లో అవగాహన పెరిగేందుకు18 సెప్టెంబర్ ”వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే”గా కూడా నిర్వహించింది. ప్రపంచ దేశాల్లో ప్రధానంగా భూగర్భ జలాల మీద ఆధారపడిన దేశం మనది. 2017లో 248.69 బిలియన్ క్యూబిక్ మీటర్స్ నీరు అందుబాటులో ఉండగా, ఇండియా భూగర్భ నీటినిధుల్లో 89 శాతం వ్యవసాయ రంగానికి, తొమ్మిది శాతం గృహ అవసరాలకు, రెండు శాతం పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నది. నీటి నిల్వల్లో సాగరాలు, సరస్సులు, చెరువులు, ఆనకట్టలు, భూగర్భ జలాలు, ఉపరితల జలాలు, మంచుకొండలు, గ్లేసియర్లు లాంటివి ప్రముఖంగా వస్తాయి.ఉపరితల జల నిధులు, భూగర్భ జల సంపదలతోనే సకల జీవరాశులు జీవిస్తాయి. భూఉపరితల జలాలతో పాటు భూగర్భ జలవనరులను కాపాడుకోవడానికి వేర్వేరు మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ జలనిధులు పెరిగితేనే భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి, వ్యవసాయ బావుల్లో నీళ్లు చేరి పంటలు సస్యశ్యామలమవుతాయి. ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్’ అంచనాల ప్రకారం వార్షికంగా అందుబాటులో ఉండే భూగర్భ జలాల్లో డెబ్బయి శాతం వరకు మాత్రమే వాడుకోవచ్చని నిర్ణయించింది. ఇండియా 2004లో 58 శాతం, 2017లో 63 శాతం వరకు భూగర్భ జలాలను వినియోగించడం గమనించింది. దేశంలోని పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, చంఢఘీర్, హిమాచల్, తమిళనాడు, పుదు చ్చెరి రాష్ట్రాలు దాదాపు డెబ్బయిశాతం వరకు వాడు కోవడం జరిగింది. భారతంలోని 22 రాష్ట్రాలు/యూటీల్లోని 534 జిల్లాల్లోని 202 జిల్లాలు దాదాపు 71 నుంచి 385 శాతం వరకు విని యోగించుకోవడం మరింత భయానికి కారణమవుతున్నది. 2030 నాటికి దేశంలోని అన్ని జిల్లాలు డెబ్బయి శాతం వరకు మాత్రమే వాడుకునేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. భూగర్భ జలాలను అధికంగా తోడినపుడు జలంలో ప్రమాదకర ఫ్లోరైడ్, ఐరన్, లవణ ధర్మం, నైట్రేట్స్, ఆర్సెనిక్ పరిమాణాలు పెరిగి ప్రజారోగ్యం సంక్షోభంలో పడవచ్చని నిపుణుల హెచ్చరిక. 2006లోనే 109 జిల్లాలో నైట్రేట్ సమస్యలను ఎదుర్కోగా నేడు 335 జిల్లాల నీటి నాణ్యతలు ప్రమాదపు అంచున నిలబడినట్టు రిపోర్టు ద్వారా వెల్లడయింది. ప్రస్తుత ‘సెంట్రల్ వాటర్ కమిషన్’తో పాటు ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు’లను ఏకం చేస్తూ భూగర్భ, ఉపరితల జలాల నియంత్రణకు నడుం బిగించాలని 2016లోనే ‘మిహిర్ షా కమిటీ’ సిఫార్సు చేయడం కూడా గుర్తు చేసుకోవాలి. స్థానిక వనరులను దృష్టిలో ఉంచుకొని వర్షం నీరు, ఉపరితల జలం, నేలలో నీరు (సాయిల్ వాటర్), భూగర్భ జల లభ్యతలను పరిగణనలోకి తీసుకొని అవసర ప్రణాళికలు రూపొందించాలి. భూగర్భ జలాలతో ఉపరితల జలాలను అనుసంధానం చేయడానికి ప్రాంతాల వారీగా చొరవ తీసుకోవాలి. ఉపరితల, భూగర్భ జలాల లభ్యతల ఆధారంగానే వ్యవసాయ పంటల ను, పంటల సాంద్రతలను నిర్ణయించు కోవాలి. భూగర్భ జలాలతో నీటి ఎద్దడి, శుష్క భూములు, పాక్షిక శుష్క ప్రాంతాల అవసరాలు తీరడానికి ప్రభుత్వాలు చట్టాలకు మరింత పదును పెట్టాలి. భూగర్భ జలాల లభ్యతతో సామాజిక-పర్యావరణ సవాళ్లు ముడిపడి ఉన్నాయి. జలంతో జీవనం, జీవనంతోనే ఆరోగ్యం సిద్ధిస్తాయనేది తెలుసుకోవాలి. భూగర్భ, ఉపరితల జల వనరులను అమూల్య జాతి సంపదగా గుర్తించి కాపాడుకోవాలి.
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి,9949700037