గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పవు

– ఎస్పీ డివి.శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లాలో గుట్కాను పూర్తిస్థాయిలో లేకుండా చేయడం లక్ష్యమని నిబంధనలు అతిక్రమించి అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిల్వ ఉంచిన రూ. ఎనిమిది లక్షల విలువగల నిషేధిత గుట్కాను మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిషేధిత గుట్కా లేకుండా పూర్తిస్థాయిలో నివారించడమే తమ లక్ష్యమన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో పట్టుకున్న నిందితుడు చంద్రపూర్‌కు చెందిన అమిత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, గుట్కా అమ్మకాలు, అక్రమంగా పశువుల అక్రమ తరలింపు, నిషేధిత ఆటలైన మట్కా లాంటివి కొనసాగిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దీనికోసం నెంబర్‌ 100కు లేదా 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన 8712670505 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గుట్కా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాణప్రతాప్‌, ఎస్సై గంగన్న, పీసీ సంజీవ్‌లను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, పట్టణ సీఐ సతీష్‌, ఎస్సైలు రాజేశ్వర్‌, ప్రవీణ్‌ కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.