హరీశ్‌ తప్పుగా మాట్లాడితే…

హరీశ్‌ తప్పుగా మాట్లాడితే...– ఆయనకే నోటీసులివ్వాలి కదా..?
–  రైతుల్ని శిక్షిస్తే ఏం లాభం…?
–  88 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం
–  బీజేపీకి 110 సీట్లలో డిపాజిట్‌ గల్లంతు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘రైతుబంధు విషయంలో మంత్రి హరీశ్‌రావు తప్పుగా మాట్లాడినా.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఆయనకే నోటీసులివ్వాలి..? ఆయనపైన్నే చర్యలు తీసుకోవాలి కదా…? అందుకు భిన్నంగా రైతుబంధును ఆపి, అన్నదాతలను శిక్షిస్తే ఎలా…?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ 88 సీట్లతో అధికారంలోకి రాబోతోందనీ, కేసీఆర్‌ ముచ్చటగా మూడోసారి సీఎం కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పాత్రికేయులతో కేటీఆర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ పోటీ చేసిన రెండు చోట్లా (కొడంగల్‌, కామారెడ్డి) ఓడిపోబోతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎన్నిక చాలా క్లిష్టంగా ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. ఏ పార్టీకైనా అధికారంలోకి రావటానికి 51 శాతం ఓట్లు చాలని అన్నారు. రకరకాల కారణాల రీత్యా మిగతా 49 శాతం ఓట్లు పడకపోయినా ఫరవాలేదన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ 51 శాతం ఓట్లతో అధికారంలోకి రాబోతున్నదని చెప్పారు. అనేక స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. అందుకే గోషా మహల్‌తోపాటు బండి సంజరు, ధర్మపురి అర్వింద్‌ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో రోడ్‌ షో చేపట్టిన రాహుల్‌ గాంధీ… పక్కనే ఉన్న గోషా మహల్‌కు ఎందుకు వెళ్లలేకపోయారని ప్రశ్నించారు. కరీంనగర్‌, కోరుట్లలో రాహుల్‌తోపాటు రేవంత్‌ కూడా ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి తాను విసిరిన సవాల్‌కు కాంగ్రెస్‌ నేతలెవ్వరూ ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ తెలంగాణలో చేసిన ఎన్నికల ప్రచారమంతా… రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసమేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అయినా గత ఎన్నికల్లో 108 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీకి… ఈసారి 110 స్థానాల్లో ధరవాతు గల్లంతు కానుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సైలెంట్‌ ఓటు (తటస్థులు) బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉందనీ, హైదరాబాద్‌లో సైతం తమ పార్టీ గాలి వీయనుందని వివరించారు. మ్యానిఫెస్టోలు, గ్యారెంటీలు, హామీలపై కాకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసముందనీ, అదే ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించబోతోందని చెప్పారు. ‘కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఉంది.. కానీ కాంగ్రెస్‌కు మాత్రం వ్యాక్సిన్‌ అనేదే లేదు…’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.