ఆశకు పోతే గోశి ఊశి పోయిందట

మనిషి ఆశకు అంతులేదు. ఆశించాలె. తప్పులేదు. కాని ఉన్నంతల ఊహించుకోవాలి. ‘జంగవేసేప్పుడు కందకం ఎంత ఉన్నదో చూసుకోవాలె’. లేకుంటే పంగ పల్గుతది. ‘సూచిన చుక్కలన్ని నాయే అంటే ఎట్ల’ అని మన చెంతకు వస్తయా అనుకోవాలె కాని కోరికలు గుర్రాలైనట్లు ఆశపడద్దు. ఇసొంటివాల్లు మనకు మస్తు కనపడుతరు. వాల్ల పనులు చూసి ‘ఆశకు పోతె గోశి ఊశి పోయిందట’ అని నవ్వుకుంటరు. అది ఊశి పోయినంక ఇంకేమున్నది అంత తేటతెల్లం అయితది. ఆశ నుంచే ఆశయం రావచ్చు. ఆశయం అంటే లక్ష్యం. దాని కోసం పట్టుదల మంచిదే. అందుకే అవకాశం కల్గినప్పుడే కలుగచేసికుంటరు. అప్పుడు పుట్టిందే ‘ఆశ పడినప్పుడు ఆడిందే సరసం’ అన్న సామెత పుట్టింది. అయితె అప్పుడు కాలం కల్సిరాకపోతే ‘తాడే పామై కరిచిందని’ అని అంటరు. అంతులేని ఆశ మంచిది కాదని ముందే అనుకున్నం కదా. ఇందుగురించే ‘ఆశకు అంతు లేదు నిరాశకు చింతలేదు’ సామెత పుట్టింది. ఆశపడ్డవానికి కావచ్చు, కాకపోవచ్చు. అట్లని ఆశ వద్దని ఎవరూ అనరు. అలవిగాని ఆశలు పెంచుకున్నోల్లను చూసి ‘ఆశ పడ్డ మొకం పాచి పోయిందట’ అని అంటరు. అయితె ఇవతల వాల్ల ఆశను చూసి అవతలి వాల్లు ఊకుంటరా. అన్ని పనులు చెప్పి చేయించుకుంటరు. అందుకే ‘ఆశ సిగ్గెరగదు నిద్ర సుఖమెరగదు’ అని అంటుంటరు. ఎప్పుడు నిద్ర వచ్చినా అందరం కూర్పాట్లు పడుతుంటం. బాగా నిద్ర వస్తే ఎక్కడపడితే అక్కన్నే పడుకుంటరు. నిద్ర సుఖం ఎరగదు కాని అసలు నిద్రనే సుఖం. అట్లనే ఆశ సిగ్గెరగదు అని కూడా అంటరు. ఏ ఆశ అయినా తీరాలనే అన్పిస్తుంది. అందుకే ‘ఆశ దోశ అప్పడం’ అని ఎక్కిరిస్తరు.

– అన్నవరం దేవేందర్‌, 9440763479