చినుకు పడితే అంతే…

Navatelangana,Adilabad,Telugu News,Telangana,నవతెలంగాణ-ఇంద్రవెల్లి
మండలంలోని అంజి రోడ్డు, ఎంపీడీఓ, తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే రోడ్లు వర్షాకాలంలో చినుకు పడితే చాలు బురద మయంగా మారుతున్నాయి. మేజర్‌ గ్రామ పంచాయతీలో సట్వాజీ గూడకు వెళ్లే రహదారి కూడా ఇలానే ఉంది. నిత్యం వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయానికి పదుల సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. అయితే వర్షాకాలం వస్తే చాలు ప్రజలు బురదతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కనే గుంతలతో పాటు చిత్తడిగా, బురదమయంగా మారడంతో అటు ప్రజలు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నిత్యం అధికారులు ఇదే దారిన రాకపోకలు సాగిస్తున్నారు. అయిన మరమ్మత్తులు మాత్రం చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టిసారించాలని మండల వాసులు పేర్కొంటున్నారు.