మళ్లీ గెలిస్తే ఎన్నికల వ్యవస్థకు బీజేపీ తూట్లు..!

మళ్లీ గెలిస్తే ఎన్నికల వ్యవస్థకు బీజేపీ తూట్లు..!గత కొంతకాలంగా దేశంలో జమిలి ఎన్నికల గురించి ప్రధాన మీడియా స్రవంతిలో చర్చ జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ వివిధ సందర్భాల్లో ఈ అంశం ప్రస్తావించడమే. అంతే కాకుండా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలి ఎన్నికలపై కమిటీ కూడా వేశారు. ఐదేండ్ల కాలంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, ఎన్నికల ఖర్చు విపరీ తంగా ఉంటుందని జమిలి ఎన్నికలను సమర్ధించే వారు వాదిస్తున్నారు. దీనికి కార్పొరేట్‌ సంస్థల నుండి, మధ్య తరగతి నుండి మద్దతు లభిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్ని కలు మాత్రమే విడివిడిగా జరుగుతాయని, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే 2029నుండి జమిలి ఎన్ని కలు జరుగుతాయని భావిస్తున్నారు. మళ్లీ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వయం అధికారంలోకొస్తే అసలు ఎన్నికలు జరు గుతాయా అనే చర్చ కూడా ఉన్నది. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నిక లు దేశంలో ఎన్నికల కోలాహలాన్ని తెచ్చిపెట్టాయి. పార్ల మెంటరీ ప్రజా స్వామ్యానికి ఎన్నికలే కొలమానం. ప్రజాస్వామ్య యుత పాలన కు సమయానికి జరిగే ఎన్నికలే ప్రతీకలు. పాలించే ప్రభుత్వా లపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలు, నమ్మకాలు, ప్రజలు పాటించే విలువలన్నీ ఎన్నికల ద్వారా తెలుస్తాయి. తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. తమ ఆకాంక్షలను నెరవేర్చని ప్రభుత్వా లను ఓడించే హక్కు రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించింది. ఎన్నికలు స్వేచ్ఛా యుత వాతావరణంలో జాతి, కుల, మత భేదం లేకుండా ధన, కండ బలం ప్రజలపై ప్రభావం చూప కుండా పూర్తి స్వేచ్ఛావాతావరణంలో ఎన్నికలు జరిగి ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే అవకాశం కల్పించాలి.
పెరిగిపోయిన ధన ప్రవాహం
1952-1967 వరకు జరిగిన ఎన్నికల్లో అవినీతి తరహా ఘటనలు దాదాపు లేవు. కాలం గడుస్తున్న కొద్ది విలువల్లో క్షీణత మొదలైంది. దీంతో పాటే అవినీతి పెరిగిపోయింది. ప్రజల నుంచి రావాల్సిన నాయకుడు నేడు రియల్‌, మాఫియా, కాంట్రాక్ట్‌, కార్పొరేట్‌ సంస్థల నుండి వస్తు న్నాడు. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది. గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి ఎవరైనా డబ్బు అధికంగా ఖర్చుపెట్టనిదే ఎన్నికల్లో పోటీపడటం చాలా కష్టం. విపరీతమైన ధన ప్రవాహంవల్ల చాలా సమయాల్లో నేరపూరిత మార్గాల్లో వచ్చిన డబ్బును ఎన్నికల సమయంలో ఉపయోగిస్తు న్నారు. డబ్బెంత ఎక్కువగా ఖర్చుచేస్తే అంత అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. లంచాలు పెరగడం సహజమవుతుంది. ఇది క్విడ్‌-ప్రో-కోకి దారి తీస్తుంది. ఎన్నికల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రిగ్గింగ్‌ లాంటి దుర్ఘటనలు జరిగితే ప్రజాస్వామ్యం నిజంగా ప్రమాదంలో పడినట్టే.
దేశంలో 1967 వరకు పార్లమెంటుకు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జమిలిగానే జరిగాయి. ఆ తర్వాత కాలంలోనే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయడంతో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు లేదా వెనుక జరగడం ప్రారంభమైంది. ఎమ ర్జెన్సీ, ఆ తర్వాత కాలంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం, 1989 లో విపి సింగ్‌ ప్రధానిగా ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం, 1996లో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం, 1998లో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రం లో పూర్తికాలం పని చేయకపోవడం కూడా లోక్‌సభకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఇది సహజం కూడా. లోక్‌సభ జనరల్‌ ఎలక్షన్స్‌ 17 సార్లు జరుగుతే నాలుగు సార్లు మాత్రమే ప్రభుత్వాలు ఐదేండ్ల కన్నా తక్కువ కాలం పాలిం చాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు మినహాయిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు 14 నుండి 18సార్లు ఎన్నికలు జరి గాయి. ఆయా రాష్ట్రాల్లో రెండు లేదా మూడు సార్లు మాత్ర మే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ కాలం పరిపాలించాయి.
లోక్‌సభ కాల వ్యవధి ఐదేండ్లకు సంబంధించిన ఆర్టికల్‌ 83, రాష్ట్రాల శాసనసభల కాల వ్యవధి ఐదేండ్లకు సంబం ధించిన ఆర్టికల్‌ 172 సవరణ ద్వారా ఏకకాలంలో రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌ సభకు ఎన్నికలు జరపడం సాధ్యమే. కానీ ప్రజాస్వామిక వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. ప్రజలకు జవాబుదారీగా ప్రజా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులకు జవా బుదారీగా కార్యనిర్వాహకవర్గం ఉన్నప్పుడే కొంతమేరకైనా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సీఎం అభ్యర్థి ఎవరు, పీఎం అభ్యర్థి ఎవరు అనే చర్చ కూడా వ్యక్తిస్వామ్యం, నిరంకుశ ధోరణుల నుండి పుట్టుక వచ్చినదే. ప్రజలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకుం టారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంను, పీఎం ను ఎన్నుకుంటారు. ఎన్ని కలు ఉంటున్నాయి కాబట్టే కొద్దిమేరకైనా ప్రజాసంక్షేమం, ప్రజాభి వృద్ధి గురించి పాలకవర్గ పార్టీలు ఆలోచిస్తు న్నాయి. లేనట్లయితే సహజవనరులను, దేశ ఆస్తులను పూర్తిగా బడా కార్పోరేట్‌ సంస్థలకు దోచి పెట్టడానికే పనిచేస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లు పోటీలో ఉన్న ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తారు. పోటీలో ఉన్న వారిలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి ఎన్నికల్లో గెలు స్తారు. ఇది మన ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ. 2019 లోక్‌ సభ ఎన్నికలలో సుమారు 91 కోట్ల 20లక్షల మంది ఓటర్లలో 60 కోట్ల 37 లక్షల మంది (67శాతం) తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. పోలైన ఓట్లలో 37.36శాతం అనగా 22 కోట్ల 90 లక్షల 77 వేల ఓట్లును మాత్రమే సాధించిన బీజేపీ 303 లోక్‌సభ సీట్లను (55.8 శాతం) పొందింది.
దామాషా ఎన్నికల విధానం అవసరం
తమకు నచ్చిన పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీ పొందిన ఓట్ల శాతాన్ని బట్టి ఆయా పార్టీలు పొందే సీట్ల సంఖ్యా ఉంటుంది. పార్టీ కమి టీలు తమ ప్రతినిధులను ఎన్ను కుంటారు. దీని వల్ల ఎన్నికలలో ప్రధానంగా విధానాలపై చర్చ జరుగుతుంది. భారతదేశంలోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక బహుళత్వం రీత్యా 50శాతం ప్రాదే శిక, 50శాతం పార్టీల నుండి ప్రతి నిధులను ఎన్నుకునే విధంగా దామాషా ఎన్నికల విధానం అమలు చేయాలి. రీకాల్‌, రెఫరెండంలు మరింత మెరుగైన ప్రజాస్వామిక పద్ధతి. జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, జపాన్‌, కెనడా, ఆస్ట్రియా వంటి కొన్ని దేశాల్లో కొన్నిరకాల అంశాలపైన యూరోపియన్‌ యూనియన్‌ లో చేరికలు లేదా బయటకు రావడం పైన, రాష్ట్రాల ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు తదితర విషయాలలో రెఫరెండం అమలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జునాగఢ్‌ రాచరిక రాష్ట్రం 1948 ఫిబ్రవరిలో భారతదేశంలో విలీనం చేయబడింది.ఎన్నికైన ప్రజాప్రతినిధులను వెనక్కి పిలుచుకునే ఓటరు హక్కు గురించిన రాజ్యాంగ (సవరణ) బిల్లును 1974 లో సి.కె. చంద్రప్పన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమో దం పొందలేదు. కానీ భారత రాజకీయాల్లో చర్చనీయాంశ మైంది. ఎన్నికల వ్యవస్థలోని లోపాలను సవరించి మరింత మెరుగైన విధానాన్ని తీసుకురాకుండా ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనిని ప్రజాస్వామికవాదులు, అభ్యు దయవాదులు తిప్పికొట్టాలి.
గీట్ల ముకుందరెడ్డి 94900 98857