పితస్వామ్య వ్యవస్థ నుంచి పుట్టిన సామెతలు ఇప్పుడు వింత అనిపించవచ్చు. కానీ ఆనాటి కాలం ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. వెనుకటికి ఒక ఆయన ‘నిత్తె పండుగైతే నిన్నెట్ల కొడుతూ పెండ్లమా…’ అని నిట్టూర్చిండట. నిత్తె అంటే నిత్యం అని అర్థం. ఎంత కంత్రి మొగోడైన పండుగనాడు జర ఆనందంగా గడపాలె కదా, చిన్నచిన్న దానికి భార్య మీద పండుగనాడు కూడా విరుచుక పడలేక ఈ సామెత వాడుతారు.
పండుగ అంటే ఏదైనా స్పెషల్ వంటకాలు ఉంటాయి కదా. అట్లనే నవ్వులాటకు పుట్టిన మరో సామెత ఏందంటే ‘పండుగనాడు కూడా పాత మొగుడేనా’ అంటారు. పండుగ అంటే కొంత కొత్తదనం అనే అర్థంలో ఇక్కడ మరో పరమార్థం దాగి ఉంది. ఇంట్లో పండుగ అంటే ఇల్లాలికి మహాకష్టం. తెల్లవారు నిద్రలేచింది నుంచి పనులే పనులు ఉంటాయి. అప్పుడు ఆ ఇంటి ఆమె ‘పండుగ వచ్చి పుండు పుండు చేసింది’ అనే సామెత వాడుతుంది. అంటే బాగా కష్టపడటంలో అలసట చెందటం అన్నమాట. నిజానికి పండుగలు అంటే ఉన్న వాళ్లకే. లేని వాళ్లకు లేనేలేదు. ఈ సందర్భంలో పేద రైతులు మాట్లాడే సామెత ‘పండిన దినమే పండుగ’. పంటలు పడిన దినమే పండుగ అయింది అన్నట్టు.
ఏదైనా ‘ఉన్న వాళ్లకు పండుగ లేని వాళ్లకు దండుగ’ అనే సామెత కూడా చలామణిలో ఉంది. ఈ క్రమంలోనే గద్దర్ ఏనాడు రాసిన పాట కూడా ఉంది. ‘ఏం కొనేటట్లు లేదు/ ఏం తినేటట్లు లేదు’ అనే పాటలో ‘పండుగ మీద పండుగచ్చే/ పండుగింట్ల పీనుగ ఎల్ల’ ఇలా పాటలోను ప్రజల భాష కలిసిపోతుంది.
– అన్నవరం దేవేందర్, 9440763479