– ఈవీఎంలను సమకూర్చడానికి ఈసీకి ఏడాది
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జమిలి ఎన్నికల నిర్వహణ కు సరిపడ ఈవీఎంలకు సమకూర్చడానికి ఈసీకి ఏడాది పడుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) తయారీకి అవసరమైన సెమీకండక్టర్లు, చిప్‌లలో కొరత కారణంగా జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండటానికి ఒక సంవత్సరం సమయం అవసరం అని ఈసీ వర్గాలు తెలిపాయి. ”కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సెమీకండక్టర్ల కొరత ఈవీఎంల సేకరణ సమయపాలనను మరింత గందరగోళానికి గురిచేసింది” అని తెలిపాయి. సెమీ కండక్టర్స్, చిప్‌లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) మెషీన్‌లను ఉత్పత్తి చేయడానికి కూడా అవసరం, ఇవి ఓటింగ్ మెషీన్‌లో భాగంగా ఉంటాయి.ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈసీ సెమీకండక్టర్ కొరత కారణంగా ఈవీఎంల సేకరణకు తన బడ్జెట్‌లో 80 శాతం కంటే ఎక్కువ ఉపయోగించలేకపోయిందని తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌కు ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈసీ కొరత సమస్యను లేవనెత్తినట్టు తెలిసింది. 22వ లా కమిషన్ ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తోంది. 2024, 2029లో ఏకకాల ఎన్నికల కోసం తాత్కాలిక కాల పట్టికలను రూపొందించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని అసెంబ్లీ ఎన్నికలను, చివరికి 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని సూచించవచ్చు. 21వ లా కమిషన్ 2018లో ఏకకాల పోల్స్ సమస్యను పేర్కొంది. అయితే చివరి నిమిషంలో విభేదాల ఫలితంగా తుది నివేదిక కాకుండా ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఇలా చేయడం వల్ల ప్రజా ధనాన్ని ఆదా చేయడం, పరిపాలనా యంత్రాంగంపై భారం తగ్గడం, ప్రభుత్వ విధానాన్ని మెరుగ్గా అమలు చేయడం వంటి కారణాలతో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు మద్దతు ఇచ్చింది. కానీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ”ప్రస్తుత రాజ్యాంగంలోని చట్రంలో సాధ్యం కాదు. ఆ ఆలోచన ఫలించాలంటే రాజ్యాంగ సవరణలు అనివార్యం” అని అంగీకరించింది. అయితే, ప్రభుత్వానికి తుది సిఫార్సు చేయడానికి ముందే దాని పదవీకాలం ముగిసింది. 2024, 2029లో ఏకకాల ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన ఓటింగ్ యంత్రాలను పెంచడానికి అవసరమైన రూ. రూ.5,200 కోట్లు, రూ. 8,000 కోట్ల అదనపు ఖర్చులను భరించవలసి ఉంటుందని లా కమిషన్‌కు ఎన్నికల సంఘం ఇచ్చిన అంచనాలను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశం అంతటా పోలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతుందని, 2014లో 11.8 లక్షల నుంచి 2029 నాటికి 13.57 లక్షలకు పెరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.