కవితను అరెస్టు చేయకుంటే కుమ్మక్కు అయినట్టా?

If Kavitha is not arrested, is it a conspiracy?– దళిత సీఎం నుంచి దళిత బంధు దాకా మోసమే : మీట్‌ ది ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మద్యం కేసు దర్యాప్తు నడుస్తున్నదనీ, కవితను అరెస్టు చేయకుంటే బీఆర్‌ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు అయినట్టేనా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. దళిత సీఎం నుంచి దళిత బంధు దాకా అడుగడుగునా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సచివాలయానికి రాడనీ, ఎమ్మెల్యేలు బస్తీల్లోని ప్రజల ఇబ్బందులను పట్టించుకోరని ఆరోపించారు. పదేండ్లుగా ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. దేశంలోని పార్టీలకు ఎన్నికల ఫండింగ్‌ చేస్తానని ఆ వ్యవస్థనే కేసీఆర్‌ ఛిద్రం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ఢిల్లీలో చక్రం తిప్పాలనీ, రాష్ట్రంలో కొడుకిని సీఎం చేయాలని కలలు కంటున్నారని అన్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డిలో ఓడిపోతారని చెప్పారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కర్నాటక ప్రభుత్వం అక్కడి ప్రజల నుంచి స్పెషల్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నదని ఆరోపించారు. తాము 88 మంది అభ్యర్థుల్ని ప్రకటించామనీ, ఒకటెండ్రు రోజుల్లో మిగిలిన స్థానాలకు కూడా ఎంపిక చేస్తామని చెప్పారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్తామన్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రొడక్ట్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ కొనేపార్టీ, కాంగ్రెస్‌ అమ్ముడుపోయే పార్టీ అని విమర్శించారు. ఎంఐఎంతో గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ దోస్తానా చేస్తున్నాయన్నారు. బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాం కాబట్టి పార్టీ తనను పోటీచేయొద్దని అధిష్టానం ఆదేశించిందన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరిగాదన్నారు. దీనిపై ప్రెస్‌క్లబ్‌లోనైనా..అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు సిద్ధమేనా అని సీఎంకు సవాల్‌ విసిరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన తమకు మద్దతిచ్చిందనీ, అందులో భాగంగానే ఇప్పుడు కూడా పొత్తుతో ముందుకెళ్తున్నామని చెప్పారు. జర్నలిస్టులు, పోలీసులు, రాజకీయనాయకులు 365 రోజులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల విత్‌డ్రా తర్వాత తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.