– లండన్‌లో అనిశ్చితి వాతావరణం
– ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్
నవతెలంగాణ-లండన్
2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు కోసం ఇటు భారత జట్టు అభిమానులు, అటు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7-11న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు లండన్‌లోని ది ఓవల్ మైదానం వేదికగా నిలువనుంది. అగ్రజట్ల సమరంలో తుది ఫలితంతో పాటు రానున్న అరుదైన రికార్డు కోసం ఇరు జట్ల అభిమానులు ఉత్సుకత చూపిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియాలు ఐసీసీ మూడు ప్రధాన టోర్నీల్లో చాంపియన్లుగా నిలిచాయి. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ సహా చాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు జట్లను ఊరిస్తున్న ఏకైక ఐసీసీ ట్రోఫీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గద. ది ఓవల్‌లో ఐసీసీ టెస్టు గద నెగ్గిన జట్టు.. ఐసీసీ నాలుగు టైటిళ్లు నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. అయితే.. ఈ ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లే ప్రమాదం లేకపోలేదు. లండన్‌లో అనిశ్చితి వాతావరణం ఇప్పుడు ఇరు జట్ల అభిమానులకు ఫీవర్ తెప్పిస్తోంది!.
సూచనలు క్లియర్! :
సాధారణంగా ఇంగ్లాండ్‌లో వేసవి జూన్ నెలతో ఆరంభం అవుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 18-21 మధ్య నమోదవుతాయి. ఈ వాతావరణంలో స్పిన్నర్లకు మాయ చేసేందుకు మెరుగైన అవకాశం చిక్కుతుంది. జూన్ 7-11న వాతావరణ సూచన ప్రకారం.. నాలుగు రోజులు ఎటువంటి వర్షం సూచనలు లేవు. బుధ, గురు, శుక్ర వారాలు సాధారణ వాతావరణం ఉండనుంది. శనివారం మాత్రం వర్షం కురిసేందుకు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది. ఇక ఆదివారం సైతం ఎటువంటి వర్షం సూచనలు లేవు. ఒకవేళ ఐదు రోజుల ఆటలో వర్షం కారణంగా ఏ రోజు ఆట సాధ్యపడకపోయినా.. జూన్ 12 రిజర్వ్ డేను వాడుకునేందుకు అవకాశం ఉంది. వాతావరణ సూచనల ప్రకారం ఐదు రోజుల ఆటలో ఒక్క రోజు వరుణుడు ఆటంకం కలిగిస్తే పెద్ద ప్రమాదం లేదు. 90 ఓవర్ల ఆట నష్టపోయినా.. రిజర్వ్ డేను ఉపయోగించుకోవచ్చు. కానీ లండన్‌ది అనిశ్చితి వాతావరణం. ముంబయి తరహాలో ఎప్పుడు వర్షం కురుస్తుంది, ఎప్పుడు ఎండ కాస్తుందో చెప్పటం కష్టం! ఇదే అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తుంది.
ఓవల్‌లో ప్రాక్టీస్ :
అరుండెల్ క్యాసిల్ క్రికెట్ క్లబ్ నుంచి శనివారం లండన్‌కు చేరుకున్న భారత క్రికెటర్లు.. ఆదివారం ది ఓవల్ మైదానంలో సాధన చేశారు. మేఘావృతమైన ఆహ్లాదకర వాతావరణంలో బ్యాటర్లు, బౌలర్లు ప్రాక్టీస్ చేయటం కనిపించింది.