కుంచం తిరగేసైనా కొలిస్తే….!

కుంచం తిరగేసైనా కొలిస్తే....!ఆరెస్బీ
బాగా ఆలోచించగా.. చించగా.. సోలతో నిలవుగా కొలవడానికి వీల్లేనపుడు తిరగేసైనా కొలిస్తే నాలుగు గింజలు నిలుస్తాయని గిరీశం చెప్పింది కరెక్టేననిపించి పెద్దసారుకు! ”క్యుమిలోనింబస్‌” మేఘాలు ఎన్నికల వేళ చీకట్లు కమ్ముకుంటూంటే ఆయన మెదడులో పాదరసం పరుగులు పెడుతున్నది. నూటా నలభై కోట్ల మంది అయోధ్యలో పట్టరని తెలుసు. ఎంత మందొచ్చినా కూచోగలిగే ‘పుష్పకం’ లేకపాయే! రావణాసురుణ్ణి చంపిన తర్వాత శ్రీరాముడు ఆ పుష్పకం అసలు ఓనర్‌ కుబేరుడికి రిటర్న్‌ చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. కలియుగంలో వచ్చే అవసరాలు తేత్రాయుగంలో వారికెలా తెలుస్తాయని సమాధానపెట్టుకున్నాడు. మనసులో బాధ కలుగుతున్నా దాన్ని మొహంలో కనపడనివ్వని తత్వం ఆయనది.
గిరీశానికి ఇన్ఫెంట్‌ మ్యారేజి కరెక్టేననిపించినట్లే జనానికి ‘ఫ్రీబీస్‌’ ఇవ్వడం కూడా సరైందేననిపిస్తోంది సారుకి. ఏకంగా దేశంలోని 85 కోట్ల మందికి మరో ఐదేండ్లు ఉచిత రేషన్లివ్వాల్సిందేననుకున్నాడు. ఇస్తున్నట్లు ప్రకటించేశాడు కూడా! ఆయన బలమైన ఆలోచనేంటంటే ఎన్డీయేలు, గిండియేలు కాదు. ఒకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఓటరు మహాశయులకు ఓ రిక్వెస్ట్‌లాంటి ఆర్డర్‌ జారీ చేసేశాడు కూడా! ముందు ఒకే పార్టీ, ఆ తర్వాత ఒకే నాయకుడు. మనపవిత్ర భారతదేశంలో వందల ఏండ్లు రాచరిక వ్యవస్థ ఉండింది. పార్టీలు, ఎన్నికలు లాంటి ‘ఎదవ నూసెన్సంతా’ ఉండిందా? జనం బతకలేదా సంసారాలు చేసుకోలేదా? ఇదీ మా సారు వాదన.
బీజేపీలో కూడా వెంకటేశంలాంటి కొంటె వెధవాయిలు ఉంటారు కదా! ఉన్నారు కూడా! వాడికో డౌటొచ్చి చచ్చింది. పైగా ఆనాడు డబలింజన్‌ హోరంతా నిజమనుకున్నాడు. ‘అటు’ దూకాల్సిన వాడు ‘ఇటు’ దూకాడు. కనీసం ఉన్న చోటే ఉండుంటే గౌరవం దక్కేది. పరువు నిలబడుండేది. దేవుడు ‘మేలు’ చేసుంటే ఆ మంత్రి పదవైనా నిలబడుండేదేమో! అటు దూకుంటే బ్రహ్మాండమైన స్థానంలో నిలబడి ఉండేవాడు. ఇటు దూకి జీవితం బర్బాద్‌ చేసుకున్నాడు. ఉన్నదీ పోయింది..! అనే సామెత ఈయనకి సరిగ్గా సరిపోతుంది. ఇపుడు ‘మాజీ’ అయిపోయాడు. శాసనసభలోకి ‘ నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు. కడుపుమండి పోతున్న ఆ శిష్యుడు. గురూజీ! ఇంతకాలం ఉచితాలన్నీ వద్దంట్రి కదా! మరి ఇంకో ఐదేండ్లు ఉచిత రేషన్‌లంటున్నారేంటి?
గురువు : అప్పుడప్పుడూ ఒపీనియన్‌ చేంజి చేస్తూంటేనే గాని పొలిటీషియన్‌ కానేరడని గిరీశం చెప్పింది విన్న తర్వాతనేనోరు! ఇపుడో కొత్త ఆర్గ్యుమెంటు చెప్తా విను. మన రాజ్యం పదేండ్లు తిరిగేసరికి బీదాబిక్కీ ఎక్కడ పడితే అక్కడ కన్పడుతున్నారు. అహ్మదాబాద్‌లో గుడిసెలు కన్పడగుండా గోడలే కట్టాం. వాటికి రంగులద్దాం. అలంకారాలు చేశాం. జి-20 సమావేశాలపుడు హస్తినలో తెరలు కట్టాం. మురిక్కాలవల మీద సెంట్లు కొట్టాం. సోకులు చేశాం. అయినా ఆ పరదాల చాటు నుండి నిక్కి నిక్కి చూసిన వాళ్లనంతా లెక్కేసి దావోస్‌లో మన పవిత్ర భారతదేశం పరువుతీసే పని ఆక్స్‌ఫామ్‌ లాంటి సంస్థలు చేస్తున్నాయి. దీన్ని బట్టి ర్యాంకును కొలుస్తున్నారు. మన ర్యాంకును కిందికి నెట్టారు. అందుకే మనం ఏదో ఒకటి చేయకపోతే మన పరువు పూర్తిగా పోయేటట్లుంది. అందుకే ఇదంతా, ఆ పిడికెడు మందికీ నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. మిగిలిన దరిద్రులకే ‘సేవ’ చేసేటైమొచ్చిందోరు మై డియర్‌ బామ్మర్దీ!
శిష్యుడు : హైడ్రాబాడ్‌ నుండి పక్కా రాజకీయ నాయకులై తిరిగొచ్చినట్టున్నారే!
గురువు : ఒకసారి గడ్డం సవరించుకుని ”గిరీశమేమన్నాడోరు ! సివిలిజేషన్‌ కల్లా నిగ్గు విడో మ్యారేజీయే అయినపుడు ఇన్ఫెంట్‌ మ్యారేజీ లేకుంటే విడో మ్యారేజీలు సాధ్యం కాదు కదా! అపుడు సివిలిజేషన్‌ హాల్టయిపోదా?!” మన విధానాల్లేకపోతే పేదరికం పెరగదు. పేదలూ పెరగరు. అపుడు ఉచితంగా ఏ రేషన్‌లిస్తాం? ఇవ్వకుంటే ఈ జనమంతా మనకి ఓట్లెలా వేస్తారు? ఓట్లెయ్యకపోతే మనమెలా గెలుస్తాం? గెలవకపోతే ఆ పిడికెడు మందికీ నోట్ల కట్టలెలా వస్తాయి? అవే రాకుంటే మా ‘గుప్త నిది’ó పెరిగేదెట్లా?
శిష్యుడు : అవునండోరు! మీరు చెప్పినవన్నీ జరగకపోతే సివిలిజేషన్‌ హాల్టయిపోవడం ఖాయం.