ప్రజలకు నష్టం చేస్తే ఉద్యమాలకు సిద్ధమవుతాం

If people are harmed, we will prepare for movements– కాంగ్రెస్‌ ప్రభుత్వం… గ్యారంటీల అమలుపై కేంద్రీకరించాలి
– మంచి పనులు చేస్తే సమర్థిస్తాం… లోపాలుంటే ఎత్తిచూపుతాం
– బీఆర్‌ఎస్‌ హయాంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు
– చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలి
– అందరికీ విద్యావైద్యం అందించాలి

– రాష్ట్ర చిహ్నం మార్పుపై తొందరపడొద్దు
– చార్మినార్‌, కాకతీయ తోరణం తొలగింపు అనవసర వివాదానికి దారితీస్తుంది
– ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజలతో మమేకమై పనిచేస్తాం : నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేయాలి. హామీలను అమలు చేస్తే, ప్రజలకు మంచి పనులు చేస్తే సమర్థిస్తాం. కాంగ్రెస్‌ అనుసరించే విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపుతాం, వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. ప్రజలకు నష్టం చేస్తే ఉద్యమాలకు సిద్ధమవుతాం. తొమ్మిదిన్నరేండ్లపాటు బీఆర్‌ఎస్‌ హయాంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని చెప్పలేం. అయితే సంక్షేమ పథకాల వల్ల కొంత మేలు జరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలి. రాష్ట్ర చిహ్నం మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడొద్దు. కాకతీయ తోరణం, చార్మినార్‌ తొలగింపు అనవసర వివాదానికి దారితీస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మేం ప్రజలతో మమేకమై పనిచేస్తాం.’అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
‘ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరాయని చెప్పలేం. తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందనీ, నిధులొస్తాయనీ, ఈ ప్రాంతానికే ఖర్చు చేయొచ్చని, ఉద్యోగాలొస్తాయని ఉద్యమం సాగింది. కేసీఆర్‌ ప్రభుత్వం పదేండ్లు పాలించింది. కానీ ఆశించినంత అభివృద్ధి జరగలేదు. భారీ ప్రాజెక్టులను కట్టారు. వాటిలోనూ ఇంజినీరింగ్‌ లోపాలు బయటపడ్డాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ కేంద్రీకరించలేదు. వాటిని నిర్మిస్తే ఎక్కువ ఫలితాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ వాటిని నిర్లక్ష్యం చేసింది. జిల్లాల వారీగా నీటిసరఫరాను పరిశీలించాలి. ఎక్కువ నీరు ఏ జిల్లాకు వెళ్తున్నది, తక్కువ నీరు ఏ జిల్లాకు సరఫరా అవుతున్నాయన్నది గమనిస్తే చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులతో ఎక్కువ మేలు కలుగుతుంది.’అని తమ్మినేని సూచించారు.
‘మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. లక్షన్నర పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ మూడు లక్షల ఖాళీలు భర్తీ చేసే అవకాశముండగా కేవలం 40, 50 వేల ఉద్యోగాలకు మించి భర్తీ చేయలేదు. ఉద్యోగాల భర్తీలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైంది.’అని తమ్మినేని విమర్శించారు.
‘హైదరాబాద్‌ తెలంగాణలో ఉండడం వల్ల నిధుల పరంగా మేలు జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను నిర్మించింది. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆ పథకాల వల్ల కొంత ఉపయోగం కలిగింది. ఎంపిక చేసిన వారికి దళితబంధు ఇచ్చారు. అందులో అక్రమాలు జరిగాయి.’అని తమ్మినేని అన్నారు.
‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఆరు, ఏడు అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. అందరికీ విద్య అందించాలి. ప్రయివేటీకరణ విధానాల నుంచి బయటపడాలి. విద్యావకాశాలను మెరుగుపర్చాలి. నిధుల కేటాయింపును పెంచాలి. బీఆర్‌ఎస్‌ కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ హామీ ఇచ్చింది. అమలులో వైఫల్యం చెందారు. అందరికీ వైద్యం అందడం లేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాలు, అటవీ, మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్యం అందడం లేదు. ఆరోగ్య శ్రీ పథకం అమల్లో ఉంది. కానీ వచ్చిన ప్రతి జబ్బుకి ఉచిత వైద్యం అందుతుందన్న నమ్మకం లేదు. డబ్బున్న వారికే నాణ్యమైన వైద్యం అందుతున్నది. వైద్యంలోనూ ఆశించిన ప్రగతి రాలేదు.
దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తామంటూ బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. కానీ అమల్లో విఫలమైంది. కేసీఆర్‌ హయాంలో 16 వేల ఎకరాలను పంచారు. అవి కూడా లెక్కల కోసం రాళ్లున్న భూములను ఇచ్చారు. భూపంపిణీలో కేసీఆర్‌ ప్రభుత్వం వైఫల్యం చెందింది.
ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు తగ్గిపోయింది. రాజకీయ పదవులు ఇవ్వడం కోసమే అవి నామ్‌కే వాస్తేగా మారాయి. సక్రమంగా నిధులు కేటాయించి వాటిని ఖర్చు చేసి ఆయా తరగతుల ప్రజలను అభివృద్ధి చేయలేదు. స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం ఆశించిన ప్రగతిని సాధించలేదు.
కనీస వేతనాల సమస్య తీవ్రంగా ఉన్నది. ఆశాలు, అంగన్‌వాడీలు, ఆర్టీసీ కార్మికులకు సమ్మె తర్వాత కొంత మేలు కలిగింది. 73 షెడ్యూల్‌ పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. కనీస వేతనాల కోసం జీవో రూపొందించారు. కానీ గెజిట్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కుదించి గతంలో ఉన్న వాటినే కనీస వేతనాలుగా ప్రకటించింది. ఇది అన్యాయం. వేతనాల విషయంలోనూ కార్మికులకు తగిన న్యాయం జరగలేదు.
కుల వివక్ష ఇంకా పెరిగింది. తెలంగాణ వచ్చాక కులదురంహకార హత్యలు జరిగాయి. విద్యావైద్యం, భూమి, ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు, భూపంపిణీ, కనీస వేతనాల అమలు, సామాజిక న్యాయం అమలు జరగలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏపీలో రాజధాని విషయంలో వచ్చిన వివాదం వల్ల తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. కొందరికి మేలు జరిగింది. కానీ సాధారణ ప్రజలు, అట్టడుగు పేదలు ఇబ్బందులు పడుతున్నారు.’అని తమ్మినేని వివరించారు.
‘వాగ్ధానాల అమల్లో కేసీఆర్‌ విఫలం కావడం, అప్రజాస్వామికంగా వ్యవహరించడం, పౌరహక్కులకు భంగం కలిగించడంతో, బీఆర్‌ఎస్‌ మీద అసంతృప్తి పెరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వమొచ్చి ఆర్నెల్లు అవుతున్నది. మూడు నెలలుగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నది. కాంగ్రెస్‌ పాలనపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఉన్నంతలో ఒకటి, రెండు హామీలను అలు చేసింది. ఇచ్చిన హామీలలో అమలు చేయాల్సిన ప్రధానమైనవి ఇంకా ఉన్నాయి. కేంద్రం వైపు నుంచి విభజన హామీలు అమలు కాలేదు. కేసీఆర్‌ ఉన్నపుడు కేంద్రంపై పోరాటం చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా వాటిపై కేంద్రీకరించడం లేదు. రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోపు చేయాలి. వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ ఇస్తామన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీలను సక్రమంగా అమలు జరపాలి. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేయాలి.’అని తమ్మినేని సూచించారు.
‘ఈ పదేండ్ల కాలంలో అనేక సమస్యలపై ఉద్యమాలు చేశాం. భూ సమస్య, ఇండ్లు, ఇండ్ల స్థలాలపై పోరాటాలు నిర్మించాం. ప్రభుత్వ భూములను ఆక్రమించాం. 20 జిల్లాల్లో ఇండ్ల స్థలాలను ఆక్రమించాం. గుడిసె వాసులపై దాడులు, పోలీసు కేసులయ్యాయి. వాటిని తట్టుకుని నిలబడ్డాం. ఆశాలు, అంగన్‌వాడీలు, కార్మికులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయి. మోడీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. జాతీయ స్థాయిలో రైతాంగ పోరాటాలకు మద్దతుగా రాష్ట్రంలోనూ ఉద్యమాలు చేశాం. నిరసనల్లో పాల్గొన్నాం.’అని తమ్మినేని అన్నారు.
‘ఎన్నికల ఫలితాల్లో మాత్రం వెనుకబడ్డాం. పొత్తులు, ఎత్తుల్లో కేసీఆర్‌ చివరి వరకు ఊరించి సీట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ కూడా మొదట రెండు సీట్లు అని, తర్వాత ఒక సీటు ఇస్తామని చెప్పింది. అది కూడా సాధ్యం కాకపోవడంతో చివరికి సొంతంగా పోటీ చేశాం. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. సంప్రదాయంగా కమ్యూనిస్టులకు ఓటేసే ప్రజలు కూడా కాంగ్రెస్‌కు ఓటేశారు. మేము పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆశించిన ఓట్లు రాలేదు. పార్టీలో సంస్థాగత లోపాలున్నాయి. రాజకీయ కారణాలతోపాటు పార్టీలో ఉన్న బలహీనతలు పనిచేశాయి. వాటిని అధిగమించడానికి కృషిచేస్తాం.’అని తమ్మినేని చెప్పారు.
‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శించడం వల్ల తీవ్ర నష్టం జరిగింది. రూ.17 వేల కోట్లు ఇవ్వకుండా నిరాకరించింది. తెలంగాణ వచ్చిన కొత్తలో బీఆర్‌ఎస్‌ కేంద్రంపై పోరాడలేదు. చివరి రోజుల్లో పోరాటం చేసింది. బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్పింది. కాంగ్రెస్‌ కూడా కేంద్రంపై పోరాటం చేయడం లేదు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం నిధులివ్వకపోగా చులకనగా చూడడం, చరిత్రను వక్రీకరించే పనిచేసింది. నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించేందుకు సాహసించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా అలాంటి వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పందించింది, ఆవ్యాఖ్యలను ఖండించింది కమ్యూనిస్టులే. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల పేరుతో కమ్యూనిస్టు పార్టీలు కార్యక్రమాలను నిర్వహించాయి.’అని తమ్మినేని అన్నారు.
‘పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కార్యాచరణ రూపొందిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతిస్తాం. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినపుడు ఇదే విషయాన్ని చెప్పాం. ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపుతాం. సరిచేయడానికి ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలకు నష్టం చేసే పనులు చేస్తే వారిని సమీకరించి ఉద్యమాలకు సిద్ధమవుతాం.’అని తమ్మినేని చెప్పారు.
‘తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలుపుతున్నది. తెలంగాణ సాధన కోసం అమరులైన వారికి జోహార్లు అర్పిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజలతో మమేకమై పనిచేస్తాం.’అని తమ్మినేని వివరించారు.
‘రాష్ట్ర చిహ్నం మార్పు విషయంలో తొందరపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించాం. దాన్ని ఆయన అంగీకరించారు. రాష్ట్ర గీతం విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనను సీపీఐ(ఎం) అంగీకరించింది. కానీ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ తొలగింపు వంటివి అనవసర వివాదాలకు దారితీస్తుంది. ప్రజా సమస్యలపై కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. విభజన హామీలపై కేంద్రంపై పోరాడాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం సరైంది కాదని సీఎంకు చెప్పాం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించాలి’అని తమ్మినేని సూచించారు.