వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టినట్టు నిరూపిస్తే..

వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టినట్టు నిరూపిస్తే..– రాజకీయాల నుంచి తప్పుకుంటా
– ప్రజలకు పని మనిషి లాగా పనిచేస్తా : నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం
నవ తెలంగాణ- నకిరేకల్‌
తాను ఎమ్మెల్యేగా (2014) ఉన్న కాలంలో ఏ వ్యాపార వేత్తనైనా ఇబ్బంది పెట్టినట్టు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రత్యుర్థులకు సవాల్‌ విసిరారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలోని పన్నాల గూడెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులను కూడా ప్రశాంతంగా ఓటు వేయనీయలేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తన నోటికొచ్చిన విధంగా మాట్లాడారన్నారు. ఎవరైనా ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి, పార్టీ మేనిఫెస్టోను వివరించుకుంటూ ప్రచారం నిర్వహిస్తారని, కానీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తనను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలో గంజాయి సృష్టించింది.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుటుంబమేనని తెలిపారు. బొందల గడ్డను ధ్వంసం చేసిన చరిత్ర అతనిదేనని విమర్శించారు. సత్యానికి, అసత్యానికి అరాచకానికి, సహనానికి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలపాటు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేశారు. నియోజకవర్గంలో బలమైన శక్తిగా కాంగ్రెస్‌ పార్టీ ఎదిగేలా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. మీకోసం, ప్రజల కోసం ఒక పనిమనిషి లాగా పని చేస్తానన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలవబోతున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు చెప్పారు. రానున్న ఐదేండ్లలో నకరేకల్‌ నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్‌, బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ పూజర్ల శంభయ్య, కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో మెంబర్‌ చామల శ్రీనివాస్‌, నకిరేకల్‌ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్‌ రావు, చిట్యాల మున్సిపాలిటీ చైర్మెన్‌ కోమటిరెడ్డి చిన్న వెంకట్‌ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నకిరేకంటి ఏసు పాదం, నాయకులు యాస కరుణాకర్‌ రెడ్డి, లింగాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.