– అమెరికా, నాటో మిత్రపక్షాలకు హెచ్చరిక
– అణు దాడి నిబంధనలను సరళతరం చేసిన పుతిన్
– కీలక పత్రాలపై సంతకాలు
మాస్కో: అణ్వాయుధాలను వినియోగానికి సంబంధించిన నిబంధనలను సరళతరం చేసే పత్రాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకాలు చేశారు. అణ్వాయుధ దేశం మద్దతుతో ఏ దేశమైన రష్యాపై దాడి చేసినట్లైతే ఆ దాడిని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు. రష్యాపై పెద్దఎత్తున వైమానిక దాడికి దిగినట్లైతే వెంటనే తాము అణ్వాయుధాలను వినియోగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొత్త అణు సిద్దాంత విధానాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ చర్య వెలువడింది. పైగా అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాలోని లక్ష్యాలపై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌ను అనుమతిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్న వెంటనే పుతిన్ ఈ చర్యలు చేపట్టారు. రష్యాపై దాడికి దిగే సాహసం చేయకుండా పశ్చిమ దేశాలను వెనక్కి మళ్ళించేందుకు అవసరమైతే దేశ అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సంసిద్ధంగా వున్నట్లు పుతిన్ ప్రకటించారు. బైడెన్ నిర్ణయానికి, రష్యా చర్యకు మధ్య సంబంధం గురించి మీడియా ప్రశ్నించగా, సవరించిన అణు సిద్ధాంతాన్ని సకాలంలో ప్రచురించామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ పత్రాన్ని సవరించాలని ఈ ఏడాది ప్రారంభంలోనే పుతిన్, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని చెప్పారు. ప్రతిపాదిత అణు సిద్ధాంతంలో మార్పుల గురించి పుతిన్ తొలుత సెప్టెంబరులో ప్రకటించారు.
పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధానికి దిగితే రష్యాపై నాటో యుద్ధంచేసినట్లే పరిగణిస్తామని పుతిన్ ఇంతకుముందే అమెరికా, నాటో మిత్రపక్షాలను హెచ్చరించారు. అణు దాడి లేదా సాంప్రదాయ ఆయుధాలతో దాడి వీటిల్లో ఏ దాడికి దిగినా రష్యా అణ్వాయుధాలను ఉపయోగించగలదని సవరించిన ఆ పత్రం పేర్కొంటోంది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు,విమానాలు, డ్రోన్‌లు, ఇతర ఎగిరే ఏ వాహనాలతోనైనా పెద్ద ఎత్తున దాడి చేసినా ఈ నిబంధనలు వినియోగంలోకి వస్తాయని స్పష్టం చేసింది.