కొన్ని సెట్టింగ్‌లు మార్చుకుంటే…

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వాడకం రోజురోజుకూ పెరిగిపోతుంది. గతంలో ఫోన్‌ అంటే కేవలం మాట్లాడుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోడానికి మాత్రమే అనుకునే జనం ఇప్పుడు ప్రతి అవసరానికి ఫోన్‌ తప్పనిసరైంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో పెట్టిన లాక్‌డౌన్‌ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. పిల్లలకు కూడా ఆన్‌లైన్‌ క్లాసుల ట్రెండ్‌ అప్పుడే మొదలైంది. దీంతో పెద్దల నుంచి పిల్లల వరకూ స్మార్ట్‌ ఫోన్‌ వాడకం తప్పనిసరైంది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో? నష్టాలు కూడా అలాగే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వినియోగిస్తే మెదడు ఆలోచించే స్థాయి తగ్గిపోతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువసేపు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తే ముఖ్యంగా వయసుతో సంబంధంలేకుండా నిద్రలేమి సమస్య వేధిస్తుందని పేర్కొంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వెలువడే కిరణాల వల్ల నిద్రలేమి సమస్య వస్తుందని చెబుతున్నారు. అందువల్ల మీరు వాడే ఫోన్లో కొన్ని సెట్టింగ్స్‌ మారిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లో మార్చాల్సిన సెట్టింగ్స్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
– ఫోన్‌ కాంతి ద్వారా వచ్చే నీలి కాంతి ఉద్గారాలు మీకు నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఉత్పతయ్యే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను అడ్డుకోవడం వల్ల నిద్ర సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆండ్రాయిడ్‌ 7.1 వెర్షన్‌ నుంచి నైట్‌ లైట్‌ అనే ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇది మనం ఫోన్‌ వినియోగించే లొకేషన్‌ ఆధారంగా సహజ కాంతికి అనుగుణంగా డిస్‌ప్లే ద్వారా విడుదలయ్యే బ్లూ లైట్‌ను తగ్గిస్తుంది. ఈ అప్‌డేట్‌ మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ముందుగా ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి డిస్‌ప్లే అండ్‌ బ్రైట్‌నెస్‌ను సెలెక్ట్‌ చేసి అందులోని నైట్‌ లైట్‌/రీడింగ్‌ మోడ్‌కను ఆన్‌ చేస్తే కళ్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.
– ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా యూట్యూబ్‌ వీడియోలకు ఎడిక్ట్‌ అయ్యారు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో నిద్ర పోకుండా యూట్యూబ్‌ చూసే వాళ్లు ఉంటారు. నిద్రవేళ రిమైండర్‌ ఆన్‌ చేసి మీరు వీడియోలను చూడటం ఆపివేసేందుకు, నిద్రించడానికి నోటిఫికేషన్‌ను పొందే అవకాశం ఉంది. ముందుగా యాప్‌ని తెరిచి పైన కుడి వైపున ఉన్న ప్రొఫైల్‌ చిహ్నంపై క్లిక్‌ చేసి, ఆపై సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి జనరల్‌ సెలెక్ట్‌ చేసి నిద్ర సమయాన్ని రిమైండ్‌ చేరు అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాలి. గూగుల్‌ని ఆన్‌ చేసి అవసరమైన విధంగా నిద్రపోయే సమయాన్ని సెట్‌ చేసుకుంటే సరిపోతుంది.