అదే జరిగి వుంటే ?

అదే జరిగి వుంటే ?‘ఎంతటి శక్తిమంతులైనా అవినీతిపరుల్ని తేలిగ్గా వదిలిపెట్టవద్దు’ అని ఏడాదిన్నర క్రితం సీవీసీ (కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌) ఏర్పాటు చేసిన నిఘా అవగాహనా వారోత్సవాల్లో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వాస్తవిక కార్యాచరణ అందుకు అనుగుణంగా జరిగి వుంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు విస్తరించిందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాల ప్రాతిపదికన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఏటా దేశదేశాల్లో సమాచారనిధి క్రోడీకరిస్తూ ఉంటుంది. ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021లో, ఆ మరుసటి ఏడాది ఇండియాకు అందులో 85వ ర్యాంకు ‘సాధిస్తే’… 2023లో ఎనిమిది స్థానాలు దిగజారి 93వ స్థానాన్ని ‘కైవసం’ చేసుకుంది. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరిలో ఒకరు సర్కారీ కార్యాలయాల్లో తమ పనులు చక్కబెట్టుకోవడానికి ముడుపులు ముట్టజెప్పినట్టు వెల్లడించారు. దేశీయంగా అవినీతి విశృంఖలత్వం పెచ్చుమీరు తోందనడానికి ఇంతకంటే వేరే దృష్టాంతం అవసరం లేదు.
దేశంలో అవినీతికి పర్యాయపదంగా కాంగ్రెస్‌ పార్టీని నేటికీ బీజేపీ పెద్దలు చూపుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం. ఆ రెండు పార్టీలు అవినీతి పరులతో అంటకాగడం, వత్తాసు పలకడంలోనూ ఎవరికెవరూ తీసిపోరు. కార్పొరేట్లకు దోచిపెట్టడానికి వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తుంటారు. మళ్లీ వారే అవినీతి గురించి గురివింద నైతిక విలువలను బోధిస్తూంటారు. నేడు దేశంలో అవినీతి వ్యవస్థీకృతం అయిపోయింది. సరళీకృత ఆర్ధిక విధానాల పుణ్యమిది. 2జీ సెక్ట్రమ్‌ కుంభకోణంలో కణిమోళి, రాజాల గురించి దేశంలో జరిగినంత చర్చ, ఆ స్పెక్ట్రమ్‌ వల్ల ప్రయోజనం పొందిన టాటా, అనీల్‌ అంబానీల గురించి జరగదు. భగవాన్‌ సత్యసాయిబాబా మరణవార్త అధికారయుత ప్రకటన వచ్చేలోపు డబ్బు మూటలు, బంగారు బిస్కెట్లు తరలించుకు పోయిన వారి గురించి ఎవరూ చప్పుడు చేయరు. ఆరోజు మీడియా కెమెరాలకు చిక్కిన ఒక ‘పారిశ్రామిక దిగ్గజం’ గురించి చర్చే లేదు.
లాక్‌హీడ్‌, కాంట్రా, వాటర్‌ గేట్‌ వంటి కుంభకోణాలు అమెరికాలో జరిగాయి. అధ్యక్షుడు నిక్సన్‌కి, ఆయన సలహాదారుడు హెన్రీ కిసింజర్‌ల ఉద్యోగాలు పోయాయి. కాని మన దేశంలో హిండెన్‌ బర్గ్‌ నివేదిక మన ప్రధానిని వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయింది. మన్మోహన్‌ సింగ్‌ కాలంలో జరిగిన ‘కోల్‌ గేట్‌’ కుంభకోణానికి నేడు జరుగుతున్న దానికి తేడా ఏమిటి? కాంగ్రెస్‌ చేసింది చేతగాని కుంభకోణం అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్నది పక్క ప్రభుత్వరంగంలోని బొగ్గు గనుల్లోని ప్రయివేటు వారు తవ్వుకుపోవడానికి దగ్గరుండి సహకరిస్తుంది.
ఏది ఏమైనా మన ‘ప్రజాస్వామ్యం’ గాదె కింద పంది కొక్కుల ఒరవడి మాత్రం దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్విఘ్నంగా సాగుతోంది. సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించినట్టు ‘అవినీతిపరుల మూలంగా దేశం సర్వనాశన మవుతోంది. మందిని ముంచి దోచుకున్న డబ్బుతోనే చట్టం కళ్లకు గంతలుకట్టే బడాబాబుల దిలాసాతనంతో స్థానికంగా అవినీతి వ్యతిరేక పోరాటమంతా కొండలను తవ్వి ఎలుకలను పట్టిన చందమవుతోంది!’
సామాజిక ప్రగతిఫలాలను గుటకాయ స్వాహా చేస్తున్న ఆ చెదపురుగుకు విరుగుడు మందు వేసేవారు ఇక్కడ అక్కడక్కడా కనబడుతున్నారు. తాజాగా విజయన్‌ కేరళను అవినీతిరహిత రాష్ట్రంగా రూపోందించి ‘తలెత్తుకు తిరుగుతున్నామన్న’ మాట కూడా విధానాలకి సంబంధించే! కేవలం అవినీతి గురించి కాదు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగులపై వంద రోజుల్లోనే చర్యలు తీసుకుంటాం, సర్కారీ కార్యాలయాల్లో పారదర్శకతకోసం ప్రాణమిస్తాం.. లంచమడిగితే చెప్పుతో కొట్టండి వంటి ఊక దంపుడు ప్రకటనలు చేయడానికి చాల ప్రభుత్వాలెప్పుడూ ఉవ్విళ్లూరుతుంటాయి. కానీ, అన్ని రకాల అక్రమాలకు తల్లివేరు లాంటి పెట్టుబడిదార్ల అవినీతిపై రాజీలేని పోరాటమంటే మాత్రం వారి నోళ్లకు చప్పున తాళాలు పడిపోతాయి.
అవినీతిపరులుగా వాసికెక్కిన వాళ్లకు వంత పాడేందుకు, అటువంటి వారితో ఫొటోలు దిగేందుకు ఎంతమాత్రం సిగ్గుపడని కొంతమంది గురించి ప్రధాని మోడీ ఇటీవల ప్రస్తావించారు. ఆయన స్పష్టీకరించినట్టుగా అటువంటి ధోరణులు భారతీయ సమాజానికి శ్రేయస్కరం కానే కావు. కానీ, తీవ్ర స్థాయి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగా అభియోగాలను వీపున మోస్తున్న జగ త్కంత్రీలు వీరి హయాంలోనే బెయిళ్లపై దర్జాగా బయట తిరుగుతున్నారు. కొందరు బెయిలు అవసరమే లేకుండా నెట్టుకొస్తున్నారు. అటువంటి అవినీతి అనకొండల నాట్యాలకు నాగస్వరాలూదే స్వార్థ రాజకీయాలు నేడు దేశీయంగా రాజ్యం చేస్తున్నాయి. వాటికి చరమగీతం పాడగలగాలి. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టి తీరాలన్నప్పుడు భారీ భుజంగాలను యథేచ్ఛగా తిరగనివ్వడం సమాజానికి పెనుప్రమాదకరమే కదా!