వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలి

– కవిత బెయిల్‌ పిటిషన్‌పై ట్రయల్‌ కోర్టు వ్యాఖ్యలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వాదనలు వినిపించకపోతే తాము దాఖలు చేసిన పిటిషన్‌ వెనక్కి (విత్‌ డ్రా) తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులకు రౌస్‌ ఎవెన్యూ (ట్రయల్‌) కోర్టు స్పష్టం చేసింది. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ పై రెండు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ ట్రయల్‌ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే, అసలు ఛార్జిషీటే సరిగా లేదని, తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం సీబీఐ స్పెషల్‌ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేనందున, విచారణ వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన స్పెషల్‌ జడ్జి, న్యాయవాదులు నితీశ్‌ రాణా, మోహిత్‌రావులు రాలేదా? అని ప్రశ్నించారు. ‘వాదనలు వినిపించకపోతే తాము దాఖలు చేసిన పిటిషన్‌ వెనక్కి (విత్‌ డ్రా) తీసుకోండి. డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలకు చివరి సారి అవకాశం కల్పిస్తున్నాం’ అని చెప్పారు. తదుపరి విచారణ ఆగస్టు 7న (రేపు) మధ్యాహ్నం 12:30 వాయిదా వేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేశాయి. తొలుత ఈడి ఆ తరువాత సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారించాయి. అనంతరం కవితతోపాటు మరో నలుగురి ప్రమేయంపై సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.
నేడు కవితతో కేటీఆర్‌, మాజీ మంత్రుల ములాఖాత్‌
తీహార్‌ జైలులో ఉన్న కవితను మంగళవారం ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు కలువనున్నారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తొలుత సోమవారమే కవితతో ములాఖాత్‌ కావాలని భావించగా పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర మాజీ మంత్రులు న్యాయ నిపుణులతో సమావేశం అయ్యారు. దీంతో కవితతో ములాఖాత్‌ సమావేశం నేటికి వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.