కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతం..

If the Center does not cooperate Fighting..– ప్రజల కోసమే ఒక మెట్టు దిగా..
– ప్రజావసరాలను మరిచిన గత ప్రభుత్వం
– నగరాభివృద్ధికి కేటీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే తాము సహకరిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
– బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో గంజాయి, డ్రగ్స్‌ పెరిగాయని వ్యాఖ్య
– జాతీయ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన
– పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
”హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం.. నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం.. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా తప్పితే.. రాజకీయాల కోసం కాదు.. ప్రజావసరాలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిచింది.. రానున్న రోజుల్లో కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేస్తాం..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో గురువారం పర్యటించిన సీఎం, జవహర్‌నగర్‌ ఆర్మీ డెంటల్‌ కాలేజీ స్నాతక్సోవంలో పాల్గొన్న అనంతరం సికింద్రాబాద్‌ అల్వాల్‌ టిమ్స్‌ సమీపంలోని జాతీయ రహదారి (ఎస్‌హెచ్‌01) ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల అవసరాన్ని మరిచిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాజీవ్‌ రహదారి (ఎస్‌హెచ్‌01) ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టును పక్కన పెట్టిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి, ఈ ప్రాజెక్టు అవసరాన్ని వివరించి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఈ కారిడార్‌ పూర్తయితే మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. అలాగే మేడ్చల్‌ ప్రాంతంతోపాటు ఉత్తర తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కారిడార్‌ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారంగా నిలుస్తుందని చెప్పారు. భూముల కేటాయింపు, చాంద్రాయణ గుట్ట రక్షణ శాఖ భూముల లీజ్‌ రెన్యూవల్‌ చేయకుండా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాప్యం చేసిందనీ, తాము అధికారంలోకి రాగానే తక్షణమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామనీ చెప్పారు. కేంద్రాని కి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం పరస్పరం సహకరించుకోవడం వల్లే ఈ సమస్య త్వరగా పరిష్కారమైందన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో గంజా యి, డ్రగ్స్‌, పబ్బులు పెరిగాయి తప్పితే నగరాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
రెండో దశలో 75 కిలో మీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లం.. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, ఎన్నికలు ముగిశాక అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి కోసం భవిష్యత్‌లోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని, కేంద్రం సహకరించకపోతే కొట్లా డుతామన్నారు. తమ పోరాటం ఫలించిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అంటున్నారని.. ఆయన ఏం పోరాటం చేశారని ప్రశ్నించారు. ట్విట్టర్‌లో వ్యంగంగా పోస్టులు పెట్టడం తప్పితే కేటీఆర్‌ చేసిందేమీ లేదన్నారు. తాము కేంద్రం నుంచి అనుమతులు తీసుకొస్తే కేటీఆర్‌ పోరాటం చేశారని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం ఇందిరాపా ర్కు వద్ద కేటీఆర్‌ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. కేటీఆర్‌ చచ్చుడో.. అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేపట్టాలన్నారు. ఈ దీక్షకు తమ కార్యకర్తలే కంచె వేసి కేటీఆర్‌ను కాపాడుతారని చెప్పారు.
స్నాతకోత్సవానికి రావడం సంతోషం కలిగించింది
కాలేజీ స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషం కలిగించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌లోని సికింద్రాబాద్‌ ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ స్నాతకోత్సవ వేడుకల్లో సీఎం పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో ప్రతి విద్యార్థినీ అభినందిస్తున్నానని, కృషి, అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయని చెప్పారు. సక్సెస్‌ను ఆస్వాదించాలి కానీ, ఎప్పుడూ బాధ్యతలను మరిచిపోవద్దన్నారు. మీరు చేసే పనులు మీ కుటుంబానికే కాదు.. కాలేజీకీ గుర్తింపును తీసుకొస్తాయన్నారు. ఏసీడీఎస్‌ మన సైనికుల పిల్లలకు సేవలందించడం సైన్యానికి, దేశానికి గర్వ కారణం అన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి
జగ్జీవన్‌ రామ్‌ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లో బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ను సీఎం ప్రారంభించారు. జగ్జీవన్‌ రామ్‌ రాజకీయాల్లో ఉన్నంత కాలం గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీతో కొనసాగారని తెలిపారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని గుర్తు చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది జగ్జీవన్‌ రామ్‌ కూతురు మీరాకుమా రి అని, రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందన్నారు. దళితులు, గిరిజనులు, బీసీ, మైనార్టీలందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామని చెప్పారు. గతంలో రెసిడెన్షియ ల్‌ స్కూల్స్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవని, ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలను చెరిపేయాలనుకుంటున్నామని తెలిపారు. పౖౖెలెట్‌ ప్రాజెక్టుగా కొడంగల్‌లో శంకుస్థాపన చేశామని తెలిపారు. చదువు మీద పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడి అని, చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని చెప్పారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చినట్టు తెలిపారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఒకసారి దొరల చేతుల్లో ఉంటే.. మరోసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా, లేకున్నా నేడు అసెంబీ ్లలో గడ్డం ప్రసాద్‌ను అధ్యక్షా అని పిలవాల్సిందే అన్నారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.