వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె.నరేష్, శరణ్య ప్రదీప్ నటించారు. దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఓ ముఖ్యపాత్రలోనూ నటించారు. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ముందస్తు ప్రీమియర్ షోలను ప్రదర్శించగా, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో బుధవారం నటుడు వి.కె. నరేష్ మీడియాతో మాట్లాడుతూ, ‘వెంకటేష్ మహాతో నా ప్రయాణం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నుంచి మొదలైంది. వినోదం, సందేశం కలిసి రావడం చాలా అరుదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్లు మొదలుపెట్టాం. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ప్రేక్షకులు ఎంజారు చేస్తూనే ఉన్నారు. పైగా ఇప్పుడు పొలిటికల్ సీజన్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. రాజకీయాల వల్ల ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కొంటున్న యదార్థ పరిస్థితులను సినిమాగా తీయడం జరిగింది. సంపూర్ణేష్‌కి ఇది సెకండ్ లైఫ్ అవుతుంది. నేను, మహా ముఖ్య పాత్రలు పోషించాం. దాదాపు 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. ఇందులో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తరహా పాత్ర నేను పోషిం చాను. గ్రామ సర్పంచ్ వారసత్వం కోసం పరితపించే పాత్ర. సామాన్యుడు కింగ్ అయినప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది ఈ సినిమాలో చెప్పారు’ అని అన్నారు.