కాంగ్రెస్‌ మాట నిలబెట్టుకోకుంటే బీసీల నుంచి నిరసన

– బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీల కులగణన స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు జూలూరు గౌరీ శంకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాటపై నిలబడి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే బీసీల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కులగణన చేయాలనీ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్దేశ్వర పటేల్‌, బీసీ నేత జక్కని సంజరు కుమార్‌లను గాంధీ ఆస్పత్రి, కాచిగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న వారిని సోమవారం గౌరీశంకర్‌ పరామర్శించారు. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నదనీ, వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తారన్న ఆశలతో బీసీలు కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీల ఆశలను వమ్ము చేస్తున్నదని విమర్శించారు. కులగణన చేయకుండా ఓటర్‌ జాబితాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు చేస్తామని చెప్పడం ద్రోహం చేయడమే అవుతుందని తెలిపారు. దీక్ష చేస్తున్న వారిని సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి కూడా పరామర్శించారు.