పాలమూరులో కాంగ్రెస్‌ గెలిస్తే.. కమ్యూనిస్టులు గెలిచినట్టే…

పాలమూరులో కాంగ్రెస్‌ గెలిస్తే.. కమ్యూనిస్టులు గెలిచినట్టే...–  రాజ్యాంగ పరిరక్షణలో కమ్యూనిస్టుల పాత్ర
– వారి మద్దతు వెయ్యి ఏనుగుల బలం
– మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి
– ప్రజల కష్టార్జితం బూర్జువాల చేతుల్లోకి..: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌
– వంశీచంద్‌కు మద్దతుగా పార్లమెంటరీ విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
”రాజ్యాంగ పరిరక్షణలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిది. నేను విద్యార్థి దశ నుంచి వామపక్ష ప్రజా సంఘాలతో కలిసి పని చేశాను.. దేశంలో ఇండియా కుటమి అధికారంలోకి రావడం ఖాయం. పాలమూరులో కాంగ్రెస్‌ గెలిస్తే.. కమ్యూనిస్టులు గెలిచినట్లే” అని మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఏర్పాటు చేసిన పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహోద్యమం లాంటి రాజ్యాంగ పరిరక్షణలో కమ్యూనిస్టులు ముందు వరుసలో ఉన్నారన్నారు. కోరిన వెంటనే సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిందన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజాసేవకు అంకితమై పని చేస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిస్టుల సూచనలను ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
బీజేపీకి ఓట్లడిగే నైతికత లేదు..
వెంకట్రాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
డికె.అరుణది ఫ్యూడల్‌, భూస్వామ్య కుటుంబమని, ఆమె ఉన్న పార్టీ రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తేవాలనుకుంటున్నది మతతత్వ బీజేపీ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు అన్నారు. అలాంటి పార్టీ అభ్యర్థికి ఓట్లు అడిగే నైతికత లేదన్నారు. ప్రజాస్వామ్య వాదులు, మతతత్వ వాదుల మధ్య జరిగే బ్యాలెట్‌ యుద్ధంలో ప్రజలే విజయం సాధిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు అధ్యక్షత వహించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ జబ్బార్‌, నాయకులు వెంకట్‌రామ్‌రెడ్డి, కిల్లె గోపాల్‌, జీఎస్‌ గోపి, కురుమూర్తి, పద్మ, చంద్రకాంత్‌, గోపాల్‌, బల్‌రాం, రాజు, ప్రశాంత్‌, చంద్రయ్య పాల్గొన్నారు.
ఒక్క హామీనీ నెరవేర్చలేదు
టీ.సాగర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 మించి ఎంపీ సీట్లు రావని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ.సాగర్‌ అన్నారు. పదేండ్ల నుంచి తెలంగాణకు బీజేపీ ఒక హామీనీ నెరవేర్చలేదన్నారు. కోట్లాది మంది దేశ ప్రజల కష్టార్జితాన్ని కొందరు బడా బూర్జువాలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ కూలీలను రోడ్డున పడేశారన్నారు. కూలీలకు పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించకపోగా డ్రోన్‌ కెమెరాలతో పనుల పర్యవేక్షణ దుర్మార్గమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మతం, రాముడు పేర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంతో పాటు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు, మహిళలు, కార్మికులను గౌరవించని బీజేపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.