– ప్రకృతి వైద్యులు డాక్టర్ కె.వై.రామ్ చంద్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మనిషి ప్రకృతి విధ్వంసం ఆపకపోతే విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకృతి వైద్యులు డాక్టర్ కె.వై.రామ్ చంద్ర హెచ్చరించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్, సిద్ధార్థ యోగ విద్యాలయం, డాక్టర్ రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చంద్ర మాట్లాడుతూ భూమి మీద అనేక జీవ జాతులున్నప్పటికీ మనిషి మాత్రమే విధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇల్లు ఒక వైద్యశాలు, ప్రతి వంట గది ఒక ఔషధ శాలగా, ప్రతి తల్లి ఒక డాక్టర్‌గా మారినప్పుడే సంపూర్ణ ఆరోగ్య భారతదేశం అవుతుందన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే ప్రకృతిని ప్రేమించడం, దానికి అనుకూలంగా జీవించడం నేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ”మానవ జీవన విధానంలో ప్రకృతి పాత్ర” అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, మెమెంటో, సర్టిఫికెట్, చేనేత శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రకృతి వైద్యులు యోగ గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మెన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి సభాధ్యక్షత వహించారు.