అర్జెంటీనా కొత్త దేశాధ్యక్షుడు జేవియర్ మిలై ఒక కొత్త ప్రతిపాదన చేశాడు. తమ దేశ రిజర్వుబ్యాంకును ఏకంగా రద్దు చేసేసి అమెరికన్ డాలర్లనే తమ దేశ కరెన్సీగా ప్రకటించాలన్నదే అతగాడి ప్రతిపాదన. ఒక దేశపు కరెన్సీని డాలర్‌తో మారకం చేసే రేటును స్థిరంగా కొనసాగించడం వేరు. ఏకంగా దేశీయ కరెన్సీనే రద్దు చేసి డాలర్‌నే తమ కరెన్సీగా స్వీకరించడం వేరు. డాలర్‌తో స్థిర మైన మారకపు రేటు కలిగి వుండి, దేశానికి గనక స్వంత కరెన్సీ, స్వంత రిజర్వు బ్యాంక్ ఉంటే అప్పుడు ఆ దేశంలో దేశీయ కరెన్సీకి అదనం గా డిమాండ్ పెరిగినప్పుడల్లా ఆ మేరకు ఆ రిజర్వు బ్యాంక్ ముద్రించుకోవచ్చు. ఈ లోపు దేశీయ కరెన్సీ వాడకం నుండి డాలర్ల వైపు మారిపోకుండా కొన్ని నియంత్రణ చర్యలను కూడా తీసుకోవచ్చు. అలా చేస్తే కరెన్సీ మారకం రేటు స్థిరంగా కొనసాగుతుం ది. కాని దేశీయ కరెన్సీని, రిజర్వు బ్యాంకును రద్దు చేసేసి ఏకంగా అమెరికన్ డాలర్లనే దేశీయ కరెన్సీగా వాడడం అంటే అది పూర్తి మార్పు.
ఈ తేడా ఏమిటో అర్థం కావడానికి ఒక ఉదాహరణ : ఒకా నొక స్థాయిలో దేశ జిడిపి, ధరలు వడ్డీ రేట్లు నిలకడగా ఉన్న ప్పుడు దేశంలో మొత్తం కరెన్సీకి డిమాండు 100 యూనిట్లు ఉం దనుకుందాం. కాని అందుబాటులో ఉన్న కరెన్సీ 90 యూనిట్లే ఉందనుకుందాం. అప్పుడు రిజర్వు బ్యాంకు ఆ కొరవ 10 యూ నిట్ల కరెన్సీని ముద్రించి విడుదల చేయవచ్చు. అలా చేసినం దువలన డాలర్‌తో ఉన్న స్థిర మారకపు రేటు మారిపోదు. అదే డాలర్ నే దేశీయ కరెన్సీగా స్వీకరిస్తే ఏమౌతుంది? అప్పుడు ఒకానొక స్థాయిలో జిడిపి ఉండి, ధరలు, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నప్పుడు దేశంలో 100 డాలర్ల కరెన్సీకి డిమాండ్ ఉందను కుందాం. కాని అందుబాటులో 90 డాలర్ల కరెన్సీ మాత్రమే ఉందనుకుందాం. అప్పుడు అదనంగా కావలసిన 10 డాలర్ల నూ మన దేశం ముద్రించలేదు కదా (దేశీయ రిజర్వు బ్యాంకు రద్దయిపోయింది కనుక). అది అమెరికన్ ఫెడరల్ రిజర్వు చే యవలసిన పని. అప్పుడు దేశం ముందు ఉన్న పరిష్కా రాలు-(అ) ఏదో ఒక విధంగా డాలర్లను సంపాదించడం, (ఆ) విదేశాల నుండి డాలర్లను అప్పు తెచ్చుకోవడం, అవసరమైతే దేశ పబ్లిక్ సంస్థలను అమ్మేయడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తేనే దేశ జిడిపి ఇప్పుడున్న స్థాయిలో కొనసాగుతుంది. ఈ రెండు పరిష్కారాలూ కూడదు అనుకుంటే అప్పుడు మన దేశ జిడిపిని మనదగ్గర లభిస్తున్న డాలర్ల మేరకు పరిమితం చేసుకోవాలి. రిజర్వు బ్యాంకును ఉపయోగించుకుని అవసరమైన అదనపు కరెన్సీని ముద్రించడం అనే పరిష్కారం ఇప్పుడు లేదు.
మరో విధంగా చెప్పాలంటే డాలర్‌నే దేశీయ కరెన్సీగా స్వీ కరిస్తే మన విదేశీ రుణభారం పెరిగిపోతుంది. లేదా మన దేశ సంపదను విదేశాలకు అమ్ముకోవలసి వస్తుంది. అప్పుడు మన దేశ సంపద తరిగిపోతుంది. ఇలా జరగడానికి కారణం మనం ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేయడం కాదు (మన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ చేస్తే అప్పుడు విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు పెరుగుతుంది). మనకు చెలామణీ కోసం అవసరమైన కరెన్సీ కన్నా తక్కువ పరిమాణంలో కరెన్సీ అందుబాటులో ఉం డడం వలన ఇలా జరుగుతుంది.
ఒకవేళ విదేశీ రుణ భారం పెరగకుండా ఉండాలంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను కుదించుకోవలసి వుంటుంది. ఇదెందుకు జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకు: దేశ ఆర్థిక వ్యవస్థ సమ తూకంగా ఉందనుకుందాం (లోటూ లేకుండా, మిగులూ లేకుం డా ఉండడం, విదేశీ రుణాలూ లేకుండా, విదేశీ కరెన్సీ నిల్వలూ లేకుండా ఉండడం). అప్పుడు దేశం నుండి సాగే ఎగుమతుల్లో 10 డాలర్ల మేరకు పెరుగుదల వచ్చిందనుకుందాం. దేశం దిగు మతుల విలువ జిడిపిలో 10 శాతంగా ఉందనుకుందాం. అ ప్పుడు దేశ జిడిపిలో 100 డాలర్లకు మించి పెరుగుదల ఉండ డానికి వీలులేదు. (100 డాలర్ల మేరకు జిడిపి పెరిగితే దిగు మతులు 10 డాలర్లమేరకు పెంచుకోవచ్చు. ఎగుమతులవలన 10 డాలర్లు అదనంగా వచ్చాయి కనుక డాలర్ కు డిమాండ్ స్థిరంగా ఉంటుంది. ఒకవేళ దేశ ఆర్థిక వ్యవస్థలో 100 డాలర్ల కన్నా అదనంగా పెరుగుదల సాధించే అవకాశాలు ఉన్నా జిడిపి పెరుగుదలను 100 డాలర్లకే పరిమి తం చేయాలి. ఒకవేళ జిడిపి 200 డాలర్లు పెరిగితే అప్పుడు దిగు మతులు 20 డాలర్లు పెరుగుతాయి. కాని అదనంగా ఎగుమతుల ద్వారా వచ్చినవి 10 డాలర్లే. అప్పుడు డాలర్లకు కొరత ఏర్పడు తుంది. ఆ కొరత పూడ్చడానికి అప్పు చేయా ల్సి వస్తుంది).అయితే దీనికీ ఒక సమస్య ఉంది. 100 డాలర్లమేరకు దేశ జిడిపిని పెంచుకోవాలంటే ఆ అదనపు పెరుగుదలకు తగినట్టు రిజర్వు కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలి. జిడిపిలో రిజర్వు కరెన్సీ 10 శాతం ఉండాలి అనుకుంటే అప్పు డు అదనపు 100 డాలర్ల జిడిపి పెరుగుదలను ఇముడ్చుకోడానికి అదనంగా 10 డాలర్ల రిజర్వు కరెన్సీ కావాలి. ఎగుమ తుల ద్వారా సంపాదించిన 10 డాలర్లు పెరిగే దిగు మతులకు చెల్లించడానికి సరిపోతాయి. మరి 100 డాలర్ల అదనపు జిడిపి పెరుగుదలకు అవసరమయే డాలర్లు ఎక్కడి నుంచి తేవాలి? అంటే విదేశీ రుణం తేవాలి. విదేశీ రుణం పెరగకూడదు అనుకుంటే 100 డాలర్ల జిడిపి పెరుగుదల గురించి మరిచిపోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ ముడుచుకుని ఉండాల్సి వస్తుంది.
ఏదోవిధంగా జిడిపిలో వృద్ధి కావాలంటే అదనంగా సంపా దించిన 10 డాలర్లలో 5 డాలర్లను మాత్రమే దిగుమతులకోసం ఖర్చు చేసి తక్కిన 5 డాలర్లనూ జిడిపి వృద్ధికి కావలసిన రిజర్వు కరెన్సీగా ఉపయోగించాలి. అంటే అప్పుడు జిడిపి 50 డాలర్ల మేరకు మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది. కాని దేశానికి కావలసిన దిగుమతులు కుదించుకుపోతాయి. దేశీయ కరెన్సీనే ఉపయోగిస్తే అప్పుడు మన దేశంలో సంపద వృద్ధి ఎంత జరు గుతుందో అంతమేరకూ మన కరెన్సీని రిజర్వుబ్యాంకు ద్వారా ముద్రించుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంటుంది. అదే బలమైన కరెన్సీ కాబట్టి అమెరికన్ డాలర్లనే మన దేశీయ కరెన్సీగా ఉప యోగిద్దాం అనుకుంటే మనకు అదనంగా కావలసిన డాలర్లను అమెరికా ఎందుకు ముద్రిస్తుంది? అప్పుడు సంపద వృద్ధి బట్టి కరెన్సీ ముద్రణ అనే విధానం కాకుండా డాలర్ల లభ్యత బట్టి మన దేశ సంపద వృద్ధి అన్న విధానం అమలు చేయలవలసి వస్తుంది. లేదా మనకు అదనంగా కావలసిన డాలర్లను విదేశీ రుణాల ద్వారా తెచ్చుకుని దేశ సంపదను పెంచుకుందాం అనుకుంటే ఈ పెంచిన సంపద కాస్తా ఆ విదేశీ రుణాల చెల్లింపుకే సరిపోతుంది.
డాలర్‌ను దేశీయ కరెన్సీగా ఉపయోగించడం వలన జిడిపి వృద్ధి జరగకుండా ఆర్థిక వ్యవస్థ ముడుచుకుపోతుందని పైన వివరించడం జరిగింది. అలా ఆర్థిక వ్యవస్థ ముడుచుకుపోతే అప్పుడు పొదుపు చర్యలకు పూనుకోవలసి వుంటుంది. అంటే జీతాల కోత, పెన్షన్ల కోత, ఉపాధి లో కోత వంటివి అమలు చే యాల్సి వుంటుంది. ఇవేవీ చేయకూడదు అంటే జిడిపిలో వృద్ధి ఉండాలి. అంటే విదేశీ రుణం తీసుకోవాలి. అప్పుడు తాత్కా లికంగా ఈ కోతలను ఆపవచ్చు. కాని ఆ రుణాన్ని తిరిగి చెల్లిం చవలసి వచ్చినప్పుడు ఇప్పుడు ఆపే కోతలకు రెట్టింపు మోతాదులో సంక్షేమంలో కోతలు విధించాల్సివస్తుంది.
మరి ఇంత సమస్యాత్మకంగా ఉన్నప్పుడు దేశీయ కరెన్సీని కాదని, డాలర్లనే దేశీయ కరెన్సీగా స్వీకరించడం ఎందుకు ? అర్జెంటీనా విషయమే చూస్తే అక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కు వగా, ఏడాదికి 150 శాతం చొప్పున ఉంది. పెట్టుబడిదారీ వ్యవ స్థలో ద్రవ్యోల్బణానికి ఒకే ఒక మందు. మార్కెట్‌లో డిమాండ్ తగ్గించడం. అంటే ఉద్యోగాలలో కోత లేదా జీతాలలో కోత విధించడం. ఈ రెండూ నేరుగా చేయకుండా జేవియర్ మైలీ దేశ కరెన్సీని రద్దు చేసి డాలర్‌నే దేశ కరెన్సీగా ప్రతిపాది స్తున్నాడు. అలా మార్చినందు వలన కూడా మళ్ళీ పొదుపు చర్య లకే దిగాల్సి వుంటుంది. అంటే ఉద్యోగాలలో, జీతాలలో కోత. నేరుగా ఆ పని చేయకుండా డాలర్ ఆర్థిక వ్యవస్థను తెస్తానని చెప్పడం జేవియర్ మైలీ మోసకారితనానికి నిదర్శనం.
ఇంత భారీ ద్రవ్యోల్బణానికి కారణం ఏమిటి? గత అధ్యక్షుడు మాక్రి (ఇతగాడూ మితవాద నాయకుడే) దేశం నుండి ప్రైవేటు పెట్టుబడి విదేశాలకు తరలిపోతున్నందువలన దానికి పర్యవసానంగా ఏర్పడిన విదేశీ చెల్లింపుల లోటును భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున విదేశీ రుణాలను తీసుకున్నాడు. అంతే తప్ప దేశంలోని సంపద విదేశాలకు తరలిపోకుండా నియం త్రించే చర్యలు తీసుకోలేదు. అలా తీసుకున్న విదేశీ రుణాలను తిరిగి చెల్లించవలసిన సమయం వచ్చేసరికి మళ్ళీ విదేశీ చెల్లిం పులలో లోటు పెరిగి పోయింది. దీని కారణంగా దేశీయ కరెన్సీ విలువ బాగా తగ్గించుకోవలసివచ్చింది. దాని వలన దిగుమతులకు ఎక్కువ ఖరీదు చెల్లించ వలసి వచ్చింది. ఆ అదనపు ఖర్చు అంతిమంగా ప్రజలు విని యోగించే సరుకుల మీద పడింది. దాంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటే వారి వేతనాలు పెరిగే ధరలతో ముడిపడి వుండవు గనుక ధరలు పెరిగినా వారి వేతనాలు పెరగవు. కాని అర్జెంటినాలో కార్మికులందరి వేతనాలూ ధరల సూచికతో లింకు అయివు న్నాయి. అందుచేత వారి వేతనాలు కూడా ధరల పెరుగుదలతోబాటు పెంచవలసి వస్తుంది. అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని స్థితి వచ్చింది. ఇప్పుడు పరిస్థితిని అదుపులోకి తేవా లంటే పెట్టుబడుల వలసలను నియంత్రించాలి. డాలర్‌కు అర్జెంటినా కరెన్సీకి మధ్య మారకపు రేటును స్థిరీకరించాలి. ఇది జరగాలంటే ఆ దేశ కార్పొరేట్లను నియంత్రించాలి. కాని అలా చేయ కుండా కార్పొరేట్లు దేశం నుండి పెట్టుబడులను బైటకు తరలిం చుకుపోతూ వుంటే దానికి శిక్ష అక్కడి కార్మిక వర్గానికి వేయాలని సిద్ధపడుతోంది అర్జెంటీనా ప్రభుత్వం.
జేవియర్ మైలీ ప్రపంచంలో వివిధ దేశాల్లో గద్దెలను ఎక్కుతున్న నయా ఫాసిస్టు అధినేతల జాబితాలో తాజాగా చేరి న వ్యక్తి. నయా ఫాసిజం ప్రపంచంలో విజృంభించడానికి కార ణం నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో ముదురు తున్న సంక్షోభం. ఈ సంక్షోభ కాలంలో బడా కార్పొరేట్లు నయా ఫాసిస్టులతో మిలాఖత్ అయి తద్వారా తమ పెత్తనాన్ని కొనసా గించడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మికవర్గం మీద మరిన్ని దాడులకు పూనుకుంటున్నారు. ఐతే ఈ నయా ఫాసిస్టు పాల కులు ప్రస్తుత సంక్షోభం రూపాన్ని మార్చగలరేమో తప్ప సంక్షో భాన్ని నివారించలేరు. అంటే తీవ్రమయ్యే ద్రవ్యోల్బణం స్థానే నిరుద్యోగాన్ని తీవ్రతరం చేయగలుగుతారు. కార్మికుల ఆదాయాలను మరింత కుదించగలుగుతారు. అలా చేసినా ఆ తర్వాత కూడా ఈ సంక్షోభం మరింత ముదిరిపోతుంది.
సంక్షోభం ముదురుతున్న కొద్దీ అర్జెంటినా వంటి దేశాల నుండి జరిగే ఎగుమతులు మరింతగా ముడుచుకు పోతాయి. దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతుంది. వేతనాలు మ రింత తగ్గుతాయి. దేశీయ కరెన్సీగా డాలర్లనే స్వీకరిస్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ రెట్టింపు వేగంతో ముడుచుకుపోయి సంక్షోభం మరింత తీవ్రతరమౌతుంది. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం. అది జరగాలంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాల చట్రాన్ని అధిగమించాల్సిందే. ప్రత్యామ్నాయ విధానాలను చేపట్టవలసిందే.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్