రైతులు ఇంట్లో పండుకుంటే నీరు వస్తుందా..

–  రైతులపై అధికారి అవహేళన 
– నీరు లేక ఎండుతున్న పంటలు
– పెడచెవునా పెడుతున్న అధికారులు 
నవతెలంగాణ-నసురుల్లాబాద్ 
రైతులు ఇంట్లో పండుకొని సాగునీటి కోసం ఆందోళన చేయడం ఏమిటి అంటూ రైతులపై బీర్కూర్ మండల సాగునీటి అధికారి గజానందు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల నుండి దామరంచ కిష్టాపూర్, అన్నారం గ్రామానికి చెందిన రైతులు సాగునీరు అందక వరి పంట ఎండిపోవడంతో రైతులు అధికారుల పనితీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం మండల సాగునీటి అధికారి గజానందుకు ఫోన్ ద్వారా సమాచారం కోరగా రైతులు ఇండ్ల పండుకుంటే పంటలు పండుతాయ అంటూ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీర్కూరు మండలం చివరి ఆయకట్టు పంట పొలాలకు నీరు విడుదల చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుండి 26వ  డిస్ట్రిబ్యూటర్ కాలువ మైలారం మిర్జాపూర్ వీరాపూర్ కొల్లూర్ నాగారం దామరంచ అన్నారం కిష్టాపూర్ తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రధాన కాలువకు నసురుల్లాబాద్ బీర్కూర్ మండల సాగునీటి అధికారులు ఉండగా నసురుల్లాబాద్ మండలం మైలారం మీర్జాపూర్ గ్రామ శివారులకు సాగునీరు అందగా, బీర్కూరు మండలం దామరంచ అన్నారం కిష్టాపూర్ తదితర గ్రామాలకు చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతులు సాగునీటి అధికారులకు వివరించిన పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. సాగునీటి కాలువలు సక్రమంగా లేకపోవడం వలనే చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఆలస్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగునీటి కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సాగునీటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పంటలు ఎండితున్నాయని రైతులు తెలిపారు రైతులకు సాగునీరు అందిస్తూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన సాగునీటి అధికారి గజానందు రైతులపై వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంత మట్టుకు సమంజసం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గజానందు పై ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని మండల రైతులు తెలిపారు.
ఆయన ఒక ఎండు బెండకాయ: బాన్సువాడ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్ 
బీర్కూర్ సాగునీటి అధికారి గజానందు రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై బాన్సువాడ ఎస్ఇ రాజశేఖర్ కు పోన్ లో వివరణ కోరగా మండల సాగునీటి అధికారి గజ నందు ఆయన ఒక ఎండు బెండకాయని అభివర్ణించారు. తాను స్థానికంగా లేనని వచ్చిన తర్వాత విషయం ఏమిటో తెలుసుకొని రైతులకు న్యాయం చేస్తానన్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ అన్నారం దామరంచ తదితర గ్రామ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు లేక పంటలు ఎండుతున్న విషయం తెలిసిందన్నారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.