
నవతెలంగాణ- కంటేశ్వర్
ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఏవో ప్రశాంత్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బకాయిల ప్రభుత్వంగా తయారయిందని, విద్యా వైద్య రంగానికి కేటాయించాల్సిన బడ్జెట్ను సైతం, అరకొర నిధులు విడుదల చేస్తూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పేద పిల్లలకు ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు తమ సొంత పెట్టుబడితో వంట చేసి పెడుతున్నప్పటికీ వారికి చెల్లించాల్సిన బిల్లులు 9 నెలలుగా పెండింగ్లో ఉంచడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనదని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం 3000 రూపాయల గౌరవ వేతనాన్ని వెంటనే పెండింగ్ ఏరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు టోకెన్ సమ్మెను నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యవహారం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు, జిల్లాలో 8 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే టోకెన్ సమ్మెను నిరవేదిక సమ్మెగా మారుస్తామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మి, పర్వవ్వ, సుజాత, స్వప్న, సుమలత, హరి శంకర్, శేఖర్, తారాచంద్, శిరీష , నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.