గుండె కొట్టుకుంటుందంటే

ప్రశ్నలు బతికున్నట్టే
గుండె కొట్టుకుంటుందంటే
ప్రశ్నలు బతికున్నట్టే !

ఎటువంటి స్వప్నాల్లో కూడా,
ఎవడో సంకెళ్ళు పట్టుకొని
వెనక వస్తుంటాడు

నేను ఎవరి ఆస్తులు అడగలేదు
నవ్వడానికి స్వేచ్ఛ అడిగాను
దానికి ఎన్ని నేరాలు మోపుతున్నారు

కరువులో కడుపు నిండదు కానీ,
ఆయుష్షు పెరిగినట్టు
ఆశ్చర్యమేస్తుంది

ఆశయాలు సతాయిస్తుంటాయి
నమ్మకాలు హింసిస్తుంటాయి
నిప్పంటించి కాల్చేయక పోతే
ఈ దారిలో చెత్త పెరిగి, కుప్పలవుతుంది

కోపమంటే అరవడం కాదు
కళ్ళు పెద్దగ జేసి
పళ్లు కొరకడం కాదు
నీడనివ్వని గోడలను
ధ్వంసం చేయడం
సాగనివ్వని మెట్లను
సమూలంగా కూల్చడం
ఆగమైన మనిషిని ప్రేమించడం

మీరు నిరాయుధులనుకుంటున్నారు

భ్రమలు, భయాలు, బలహీనతలు
మనిషిని అద్దంలో
కళ్ళను చూసుకోనివ్వవు

ఒకసారి లేచి నిలబడండి
ఆకాశం మీ తలకు తగులుతుంది
– ఆశారాజు,
9392302245