– తాత్కాలిక సిబ్బందిని అడ్డుకున్న జీపీ కార్మికులు
– 21వ రోజూ వినూత్న రీతిలో నిరసనలు
– సీఐటీయూ, అనుబంధ సంఘాల మద్దతు
నవతెలంగాణ-విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని పంచాయతీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు జిల్లాల్లో ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా తమ సమ్మెకు సహకరించాలని కోరారు. బుధవారంతో 21వ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, అనుబంధ సంఘాలు నిరసనల్లో పాల్గొని మద్దతు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వినూత్నంగా నిరసనలు తెలిపారు.
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో ప్రయివేటు వ్యక్తితో పంచాయతీ ట్రాక్టర్‌తో పనిచేయిస్తుండగా కార్మికుడు అడ్డం పడుకుని అడ్డుకున్నాడు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెకు సహకరించాలని కోరారు. మండలంలో కండ్లు, చెవులు మూసుకుని నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో సమ్మె శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. మానకొండూర్ మండలంలో కార్మికులు తలకు ఉరితాళ్లతో వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇల్లందకుంట మండలంలో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి ర్యాలీ నిర్వహించారు. గంగాధర మండలంలో సిబ్బంది భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. మల్యాల మండలంలో మోకాళ్లపై నిల్చొని ఆవేదన వ్యక్తం చేశారు. కొనరావుపేటలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో సీఐటీయూ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే నేడు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మంచాలలో చేపట్టిన దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో చేపట్టిన సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద రావు మద్దతు తెలిపి మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట వర్షంలో దీక్ష కొనసాగించారు.
దీక్ష కేంద్రం వద్ద వంటావార్పు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జేసీకి వినతి పత్రం అందజేశారు.యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరిలో జీపీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బొమ్మలరామారం మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఐటీయూ, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహం నుంచి ఎంపీడీవో కార్యాలయం ఎదుట జరుగుతున్న సమ్మె శిబిరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపాయి. నాంపల్లిలో జీపీ కార్మికులు చేతులు జోడించి వేడుకుంటూ నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలో జీపీ కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. పెన్‌పహాడ్ మండలంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు.