– గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మంచిర్యాల నుంచి వరంగల్ వరకు చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే శరణ్యమని ములుగు జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట బాధిత రైతులు స్పష్టం చేశారు. సోమవారం ఇస్సిపేట శివారులో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను రైతులు అడ్డుకున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా నుంచి హన్మకొండ జిల్లా ఊరుకొండ వరకు చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే.. మండలంలోని మొగుళ్లపల్లి, మేదరమెట్ల, ఇస్సిపేట, రంగాపూర్ గ్రామాల ద్వారా వెళుతుంది. అర్‌ఐ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధికారులు సర్వే నిర్వహిస్తుండగా రైతులు పురుగుల మందు డబ్బాను పట్టుకొని నిరసన వ్యక్తం చేసి సర్వేను అడ్డుకున్నారు. జాతీయ రహదారికి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ భూములు ఇవ్వమని భూ నిర్వాసిత రైతులు తెలిపారు. జాతీయ రహదారిలో చాలామంది రైతులు తమ వ్యవసాయ భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని వ్యవసాయాన్ని చేస్తున్న తమకు.. భూమి పోతే జీవనోపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ రేటు ప్రకారం భూములకు ధరలు నిర్ణయించడం రైతులను మోసం చేయడమేనన్నారు.
బలవంతంగా రోడ్డు నిర్మాణం పనులు చేపడితే కుటుంబమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అనంతరం రైతులందరూ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునితకు సర్వేను అపాలంటూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు రాంరెడ్డి, అన్నారెడ్డి, లింగారెడ్డి, ముత్తరెడ్డి, సంపత్‌రావు, కృష్ణ, కొమురయ్య, సుధాకర్ రావు, నరసింగరావు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.