మనసు అద్దం దారితప్పితే..

మనసు అద్దం దారితప్పితే..కిటికీ తెరలు పక్కకు జరిపి చూసింది. ఆకాశం నిర్మలంగా కనిపించింది. చల్లని గాలి లోపలికి పరిగెత్తుకొచ్చి ఆమె చుట్టుముట్టింది. అది తెల్లవారుఝాము అని చెప్పింది.
ఓ కప్పు వేడి వేడి టీ కోసం నాలుక తొందర పెట్టింది. నేలమీద ఆమె పాదాలు నగంగా కదులుతున్నాయి.
గుమ్మం తగిలి పడబోయి నిలదొక్కుకుంది. వంట గదికి తాళం వేసి ఉంది. నా ఇంట్లో వంట గదికి తాళం ఎవరు వేసి ఉంటారని ఆలోచనలో పడింది.
ఉసూరుమంటూ మంచం దగ్గరకు చేరింది. మంచం ఓదార్చి సేదతీర్చింది.
వేడిగా మసిలే శబ్దం ఆమెను ఓ క్షణం తన కలల్లోంచి బయటపడేసింది. కానీ టీ ఆమె దగ్గరకు రాలేదు.
కిటికీ వైపు చూసింది, తెరలు కదులుతూనే ఉన్నాయి.
ఒక నిమిషం అంతా గందరగోళంగా ఉంది. ఈ ఉదయం సరిగ్గా ఉందా.. నాతో ఆటలాడుతూ ఉందా? ఆమె ప్రశ్నించుకుంది.
ఆకాశం స్పష్టంగా ఉంది. ఆకాశం రంగు మారిందో లేదో తెలుసుకుందామని మరో పడక గదిలోకి వెళ్ళింది. తూర్పు రంగులు ఆమెను బయటకు రమ్మని ఆహ్వానించాయి.
చిత్తవైకల్యం ఉంటే ఒంటరిగా ఇంట్లో ఉండాలా? ఊహూ.. ఉండాలనిపించలేదు. చాలా కాలంగా నిర్మలమైన, స్వచ్ఛమైన ఆకాశాన్ని చూసిన గుర్తు లేదు. ఈ రోజు నేనే గెలవాలి అనుకుంది.
ఒంటరిగానే తమ వీధి దాటింది. ఊళ్ళో ఎవరూ నిద్ర లేచినట్టు లేదు. ఎవరూ ఆమెను చూడలేదు. చిరునవ్వులు చిందించట్లేదు. ఆమె ముఖంలో భావోద్వేగాలు లేకుండా శూన్యంగా ఉంది.
ఆమె ప్రశాంతతకు భంగం కలిగిస్తూ ఏదో కారు చప్పుడు చేసుకుంటూ వస్తున్నది.
ఆమె ప్రధాన రహదారి దాటి కాస్త దూరం వెళ్లేసరికి అంతా బురదగా ఉంది. పరిసరాలను ఆస్వాదిస్తూ నిలబడింది. ఆకాశంలో దూరంగా మిణుకు మిణుకుమంటూ వస్తున్న ఏకైక విమానాన్ని చూసి ఆమె నవ్వింది. జారిపోతున్న చీర కుచ్చెళ్ళు ఓ చేత్తో పట్టుకుని సంబరంగా చూస్తూ మనోహరంగా నవ్వింది. అలా నవ్వుతూ పరిసరాలను మరచి ముందుకు సాగింది.
ఎదురొచ్చిన సన్నని నీటి పాయలో కాలు పెట్టగానే ఆమె చిన్న పిల్ల అయిపోయింది. జల్లుమన్న ఆ నీటిలో ఏదో వెతకడానికి ప్రయత్నించింది. అందిన గులక రాళ్ళను తీసుకుని అడవి వైపు నడిచింది. అలా నడుస్తూనే ఉంది. దారులన్నీ కలిసిపోయిన పెద్ద అడవి జుట్టు విరబోసుకుని నవ్వినట్టు తోచింది.
వెనుదిరిగి చూసింది.
‘ఏరు సూరీడూ.. ఎక్కడికి పోయావ్‌? ఇంకా రావడం లేదేంటీ.. చల్లటి గాలి తాకి గిలిగింతలు పెడుతున్నది. ముడుచుకుపోతున్నా. వణుకుతున్న. త్వరగా రావోరు’ గట్టిగా అరిచింది.
అట్లా నిలబడి కొద్దిసేపు చూసి కుడివైపుకు మళ్లింది. జివ్వుమనే నీళ్లలో గులకరాళ్లు ఏరుకుని చీర చెంగులో మూటకట్టింది. బురద దాటి కొంత దూరం వెళ్ళాక అలసట వచ్చి ఓ చెట్టుకింద చేరింది.
చుట్టూ విశాలమైన పొలాలు. వాటి రంగులు స్పష్టంగా అగుపడటం లేదు.
అలా ఎంతసేపు ఆ చెట్టు కింద నిలుచుండి పోయిందో..
కాటుక దిద్దుకున్న ఆకాశంలోకి రంగులు తొంగి చూస్తున్నాయి. ఆమె చుట్టూ పలుచని వెలుతురు పరుచుకుంది. ముఖంలో చిరునవ్వు చేరింది.
ఈ అద్భుతమైన ప్రకృతి తనను బతికిస్తుందా.. ఆనందపడింది.
దారితప్పిన సూర్యుడు చెట్ల వెనకనుంచి దొంగాట ఆడుతున్నాడు. చివరకు చెట్ల గుండా వేడెక్కిన కాంతిని వెదజల్లుతున్నాడు. చెట్ల గుండా ఉదయకాంతి నీడలతో కాసేపు ఆడుకుని వెనుదిరిగింది.
గుబురుగా పెరిగిన చెట్లు, క్రీడా మైదానాలు, సందు గొందులు దాటి తన ఇంటి కోసం తిరిగింది. ఖాళీగా కనిపించే వీధుల్లో ఆమెను పలకరించే చిరునవ్వుల ముఖం ఒక్కటి కూడా కనిపించలేదు.
‘ఒక్కరూ కనిపించరే.. ఏమై పోయారు అంతా’ దిగులు పడింది.
తన ఇంటి కోసం వెతుకుతూ తిరిగింది. విధులన్నీ తిరిగింది. తన ఇంటి జాడ కనుగొనలేకపోయింది.
‘అయ్యో.. ఇప్పుడెలా?’
నడిచే ఓపిక లేదని వీధి చివర చెట్టు కింద ఉన్న సిమెంట్‌ బల్లపై కూర్చుంది. గాలి పాడే పాటలు వింటూ కూర్చుంది. అప్పుడప్పుడు తను కూడా జత కలుపుతూ పాడింది. భూమికి ఆకాశానికి మధ్య అద్భుత లోకంలో విహరిస్తున్న ఆమె కాసేపటికి అలసిపోయింది.
లోపలి నుంచి ఆకలి పేగుల్ని మెలి తిప్పింది.
‘ఎవరైనా ఉన్నారా అక్కడీ నన్ను నా ఇంటికి చేర్చండి’ అంటూ గట్టిగా వేడుకుంది.
కాసేపటి తర్వాత అవాంఛిత చొరబాటుదారుడు తనపై చేయి సాధించినందుకు తన మెదడు సారీ చెప్పినట్టు, ఓదార్చినట్టు ఆమెకు తోచింది.
***
మసీదు దగ్గర నుంచి అల్లాహో అక్బర్‌ వినిపిస్తున్నది.
ఐదయిపోయిందా, పెద్దమ్మగారు ఇంకా లేవలేదా అంటూ మంచం కేసి చూసింది ఆయమ్మ.
ఖాళీగా పలకరించిన ఆమె మంచం చూసి గాభరా పడింది. బాత్‌రూమ్‌లో ఉందేమోనని చూసింది. కనిపించలేదు. ఇల్లంతా వెతికింది. ఎక్కడా ఆమె కనిపించలేదు. పెద్దమ్మగారూ, పెద్దమ్మగారూ అని పిలుస్తూ హాల్‌లోకి వచ్చింది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి.
ప్రతిరోజూ ఉదయపు ఎండ ఆస్వాదిస్తూ ఇంటి ముందున్న మొక్కల మధ్య గడపడం ఇద్దరికీ అలవాటు. అందుకే వాకిట్లోకి పరిగెత్తుకొచ్చి పెద్దమ్మ గారూ అంటూ పిలిచింది.
అయ్యయ్యో.. ఏరీ.. ఎక్కడా లేరే.. పెద్దమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు.
గేటు కూడా తీసి ఉండడం చూసిన ఆయమ్మ గుండె జారిపోయింది.
లంకంత ఇంటిని, అమ్మగారిని జాగ్రత్తగా చేసుకొమ్మని అప్పచెప్పి వెళ్లిన మల్లిబాబుకి, చిన్నబాబుకి, బేబమ్మకి నేను ఏమి జవాబు చెప్పాలి. లోలోన మదనపడింది ఆయమ్మ.
ఇంకా చీకటి వీడలేదు. గేటు బయటకు వచ్చింది ఎక్కడ నర సంచారం లేదు. వీధి కుక్కల అరుపులు తప్ప ఏమీ వినిపించడం లేదు.
పల్లెటూరు, అమ్మగారు అందరికీ తెలిసిన వ్యక్తి, అభిమానించే వ్యక్తి కాబట్టి యజమానురాలిని సులభంగానే పట్టుకోవచ్చని తనకు తాను భరోసా ఇచ్చుకుంది. ఎవరికి కనిపించినా అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చి దిగబెడతారని ధైర్యం నింపుకున్నది.
చీకటి విరిగిపోతూ వెలుతురు దూసుకు వస్తుండడంతో ఆయమ్మ వీధుల్లోకి పరిగెత్తింది. వీధులన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగింది. కనిపించిన వారందరినీ అడిగింది. ఫలితం శూన్యం. ఇరుగు పొరుగు కూడా తలో దిక్కు వెతకడం మొదలుపెట్టారు.
ఆయమ్మ పొంగుకొస్తున్న దు:ఖంతో కాలూ చేయి ఆడడంలేదు. అంతలో మల్లిబాబు నుంచి ఫోన్‌. ప్రతిరోజు ఉదయం ఆరుగంటల సమయంలో చేసినట్లుగానే చేశాడు. అతని ఫోన్‌ అందుకోగానే ఆయమ్మ ఏడ్చేసింది. ఆ తర్వాత విషయం చెప్పింది.
వేల మైళ్ల దూరంలో తల్లి గురించి ఆందోళనలో అతను.
***
‘నేనెక్కడున్నాను? నన్ను నా ఇంటికి చేర్చండి’ బిగ్గరగా అరుస్తున్నదామె. ఆమె అరుపులు చేరాల్సిన వాళ్ళను చేరడం లేదు.
అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికొచ్చిన ఆమె మనసు మాయ చేసి ఏదేదో చూపించింది. ఆమె అలా నడిచి వెళ్ళిపోయింది. కొన్ని గంటల పాటు నడిచింది.
తనను ఎవరూ గుర్తించలేని చోటుకు చేరింది.
లుంగ చుట్టుకుపోయిన చీర, అంట కత్తిరించిన చెదిరిన జుట్టు, దుమ్ము కొట్టుకుపోయిన కాళ్ళు, బిత్తర చూపులు, అరుపులు చూసిన జనం
ఎవరో పిచ్చిది అన్నట్టు ఒక జాలి చూపు విసిరి తమ దారిన తాము పోతున్నారు.
చిత్తవైకల్యం తో బాధపడుతున్న ఆమె నిన్నటివరకూ డైరీ రాసింది. నిన్న తనేం చేసిందో ఆమెకు గుర్తుండదు. తన డైరీ చదివితే తప్ప ఆ విషయం తెలియదు. అందుకే తన అవగాహన బట్టి గుర్తున్నదాన్ని బట్టి రాసుకుంటూ పోతున్నది. చిత్త వైకల్యాన్ని భిన్నంగా చూడడానికి ఉపయోగపడుతుందేమోనని ఆశతో రాస్తున్నది.
ఆమె వంక చూసీచూడనట్లు పోతున్నారు జనం. ఆమె దగ్గరకు ఎవరూ రావడం లేదు.
చీకటి మేఘాల్లో కూరుకుపోతున్నట్లు నిస్సహాయంగా ఉన్న ఆమె భర్త ఈ మధ్యనే ఆమెను ఒంటరిని చేసి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. ముగ్గురినీ హాస్టళ్లలో ఉంచి మంచి చదువులు చదివించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించి మురిసిపోయారు. వాళ్ళ పెళ్లిళ్లు, పురుళ్ళు అన్నీ చేసి ముచ్చట్లన్నీ తీర్చుకున్నారు.
విదేశాల్లో వాతావరణం పడక, పిల్లలతో ఉండలేక, వద్ధాప్యం తో ఇబ్బంది పడుతున్న ఆ జంటలో అతను అకస్మాత్తుగా కాలం చేశారు. అప్పుడు బయటపడింది జీవితాన్ని పరిమితం చేసే వ్యాధి అల్జీమర్స్‌ డిమెన్షియా.
ప్రాణాంతకమైన రోగం తనతో సహజీవనం చేస్తున్నదన్న విషయం తెలిసి ఆమె లోని ఆశ మరణించడం మొదలైంది. ఆలోచనలు మొద్దుబారిపోయాయి. జీవితం చివరికంటా లేకుండా మధ్యలో బండి దిగుతానని ముగింపు తప్పనిసరి అని చీకటి మేఘాల్లో కూరుకుపోతున్నది. ఆమె మనసు ప్రస్తుతంలో ఉండట్లేదు. ఎక్కడికో వెళ్లి చిక్కుబడి పోతుంది.
లేనివాటిని వింటుంది. చూస్తుంది. ఎవరికోసమో వెతుకుతూ ఉంటుంది. ఎవరో ఉన్నట్లు మాట్లాడుకుంటుంది. ఎవరైనా పలుకరిస్తే ఒకోసారి చిరునవ్వుతో సమాధానం చెబుతుంది.
ఇప్పుడు ఊరు కాని ఊళ్ళో అనాధలా.. అగమ్యగోచరంగా..
ష ష ష
అమెరికాలో ఉన్న మల్లిబాబు విషయం తమ్ముడికి, చెల్లికి చేరవేశాడు.
చీకు చింత లేకుండా ఉండాల్సిన వయసులో చిత్తవైకల్యం అంచున నిలబడ్డ తల్లి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు.
వీడియో కాల్‌ లో తల్లితో మాట్లాడి తమ మధ్య దూరాన్ని తగ్గించుకుంటున్న వాళ్ళని తల్లి అనారోగ్యం కల్లోల పరుస్తున్నది. తల్లి పట్ల ప్రేమ ఎంత ఉన్నప్పటికీ, మనసు నిలదీస్తున్నప్పటికీ కొన్ని కమిట్‌ మెంట్స్‌, ఉద్యోగ బాధ్యతలు, పిల్లల చదువులు వదిలి తల్లి కోసం వచ్చి సొంత ఊళ్ళో ఉండలేకపోతున్నారు.
మల్లిబాబు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్‌ చేయమని ఎవరికో పురమాయించాడు. చిన్న బాబు చుట్టుపక్కల అంతా వెతకమని ఊరి వారికి పురమాయించాడు.
పోయినసారి వెళ్ళినప్పుడు తల్లి చేతికి జిపిఎస్‌ బ్యాండ్‌ తగిలించి తన మొబైల్‌ కి అనుసంధానించిన విషయం బేబీకి గుర్తొచ్చింది.
వెంటనే గతం వర్తమానం వ్యత్యాసం తెలియని, రాత్రి పగలు తేడా తెలియని తల్లి ఎక్కడుందో ట్రాక్‌ చేయడానికి ప్రయత్నించింది. తల్లి ఉన్న ప్రదేశంలో సిగల్‌ తక్కువగా ఉన్నదని ప్రయత్నం చేస్తూనే ఉన్నది.
కుటుంబం తో పాటు గ్రామస్తులు కూడా పెద్దావిడ కి మద్దతుగా ఉన్నారు. ఆమె ప్రవర్తన తప్పు పట్టకుండా ఆమె అనారోగ్యాన్ని అర్థం చేసుకున్నారు. ఆమెని ఎప్పట్లానే గౌరవిస్తున్నారు. విలువ ఇస్తున్నారు.
కొంతసేపటికి బేబీ ప్రయత్నం ఫలించింది. అద్దం లాంటి మనసు దారి తప్పి చేసే గారడీ తెలియని ఆమె ఇంటికి చేరింది.
– వి. శాంతి ప్రబోధ, 9866703223