– కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..
– సుద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్, సుద్దులం జెడ్పీ హైస్కూల్ సందర్శన..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి లోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, సుద్దులంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను శుక్రవారం అకస్మీకంగా సందర్శించారు. సుద్ధపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. కూరగాయలు సక్రమంగా భద్రపర్చకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. సుద్దులం జెడ్పీ హైస్కూల్ లో తాగునీటి వసతి, కిచెన్ షెడ్, టాయిలెట్స్, క్రీడా మైదానం తదితర వాటిని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందాయా? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. గతేడాది టెన్త్ లో వచ్చిన ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు అందజేసే భోజనంలో ఎలాంటి తప్పులు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.కలెక్టర్ వెంట తహసిల్దార్ ప్రభాకర్,అధికారులు, ప్రిన్సిపాల్ నళిని, అద్యాపాకులు ఉన్నారు.