పదవి అయిపాయే..బిల్లులు రాకపాయే

Even if the post ends..if the bills don't come– అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్న వైనం
– తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మాజీ సర్పంచులు
– రేపు చలో హైదరాబాద్‌
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌
సర్పంచుల ఐదేండ్ల పదవీ కాలం అయిపోయింది. వారి స్థానంలో గ్రామాల్లో ప్రత్యేక పాలన కొనసాగుతున్నది. ఐదేండ్ల కాలంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులపై వడ్డీల మీద వడ్డీల భారం పెరుగుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం ఎలాగూ సర్పంచులకు బిల్లులను సకాలంలో చెల్లించలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా తమకు బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలని మాజీ సర్పంచులు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు.
మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తమ పంచాయతీకే అవార్డులు రావాలని పోటీపడి సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయనే ఆశతో దొరికినకాడల్లా అప్పులు తెచ్చిమరీ ముందుకెళ్లారు. డంపింగ్‌యార్డులు, పల్లెప్రకృతివనాలు, రైతువేదికలు, వైకుంఠదామాలు, సీసీరోడ్డు, డ్రైనేజీల నిర్మాణాల విషయంలో సర్పంచులతో గత ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెట్టించి మరీ పనిచేయించింది. కానీ, బిల్లుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేసింది. జీపీలకు 17 నెలల నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు అందలేదు. ఒక్కో సర్పంచికి తక్కువలో తక్కువ రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షలకుపైగా పెండింగ్‌ బిల్లులు రావాల్సి ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెగ్యులర్‌ నిధుల విడుదల జాప్యం నెలకొంది. దీంతో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ బిల్లులు లేని మాజీ సర్పంచులే లేరు. వడ్డీలతో అప్పులు కొండంత పెరిగి వారికి తలనొప్పిగా మారాయి. సర్పంచి పదవిలో ఉన్నంత కాలం అప్పు ఇచ్చిన వాళ్లు గ్రామపెద్ద అనే గౌరవంతో పెద్దగా ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు పదవి అయిపోయిన తర్వాత అప్పులోళ్లు కోడికూయకముందే ఇండ్ల ముందు వచ్చి మాజీ సర్పంచుల ఇండ్ల ముందు తిష్టవేస్తున్న పరిస్థితి. రిజర్వేషన్‌ ద్వారా ఏదో అవకాశం వచ్చిందికదా ఊర్లో నాలుగు మంచి పనులు చేద్దామనే యావతో ముందుకెళ్లిన సర్పంచులంతా ఇప్పుడు అప్పుల కొలిమిలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. అప్పులోళ్ల పోరు భరించలేక, ఊర్లో తమ మొహం చూపించలేక లోలోపల కుమిలిపోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సర్పంచులకు తీరని అన్యాయం చేసిందనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిల్లులను చెల్లించి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. ఈ నేపథ్యంలోనే మాజీ సర్పంచులు తమకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
22న చలో హైదరాబాద్‌
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ సర్పంచుల బిల్లులను ఇవ్వకుండా తొక్కిపెట్టింది. చేసిన పనులకు సంబంధించి నాకు రూ.35 లక్షలకుపైగా బిల్లులు రావాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వమూ ఇవ్వడం లేదు. గ్రామ ప్రథమ పౌరులు అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం బాధాకరం. అందుకే నిధుల కోసం ఈ నెల 22న వందలాది మంది మాజీ సర్పంచులు గన్‌పార్కు వద్దకు చేరుకుని నిరసన తెలుపుతారు. రాజకీయాలకు అతీతంగా మాజీ సర్పంచులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదుకోవాలి. రేపోమాపో ఎలక్షన్‌ కోడ్‌ వస్తే మళ్లీ రెండు మూడు నెలలు పెండింగ్‌లో పెట్టే అవకాశముంది. దయచేసి ఎన్నికల కోడ్‌ రాకముందు బిల్లులిస్తే ప్రభుత్వానికి అండగా ఉంటాం. దేవుళ్లుగా భావించి సపోర్టుగా నిలుస్తాం. లేకుంటే నేతలను ఊర్లల్లో అడుగుపెట్టనివ్వం.

– సుర్వి యాదయ్య గౌడ్‌,
మాజీ సర్పంచి (అల్లం దేవి చెరువు, యాదాద్రి భువనగిరి జిల్లా )