ఎంత దగ్గరి వాల్లు అయినా కొందరి గుణాలు తెలవాలంటే ఉత్తగనే తెలువయి. సోపతి గానికి పైసలు బదలిచ్చి సూడు, అనుకున్న టైంకు ఇస్తడా ఇయ్యడు. మల్ల అవసరం అయి అడుగుతే ఎటన్న పోతన్ననా మీదికి ఎగురుతడు. అందుకే ‘బంగారం రాకితేనే తెలుస్తది సోపతి చేస్తేనే తెలుస్తది’ అంటరు. బంగారం మంచిదో కాదో ఆకురాయికి రాస్తే దాని మెరుగు బట్టి తెల్సుకుంటరు. సోపతి గాని పైసలు బదులిస్తే సరిపోతుంది. అట్లనే కొందరి గుణాలు ఆలస్యంగా తెలుస్తయి. అందుకే ‘కుండ పల్గితే పల్గింది కానీ, కుక్క బుద్ది అయితె తెల్సింది’ అంటరు. కుక్కలల్ల రెండు రకాలు. సాదుకం కుక్కలు, ఊర కుక్కలు. ఏ కుక్కనైనా దగ్గరికి తీస్తే కొన్నాళ్లకు ఇంట్లో వండుకున్న అన్నం కుండ పట్టుకపోయి పల్గొట్టుక తిన్నదట. అప్పుడు ఆ కుండ పల్గింది కానీ ఇక ఆ కుక్కను చేరదీయద్దు అనుకున్నరు.
మరికొందరికి పిశినాసి గుణాలు ఎక్కువ వుంటయి. వాల్లు ఎట్లుంటరంటే ఇంట్ల పిల్లలకు సరిగా అన్నం కూర పెట్టరు కానీ, దొడ్డు అయిత లేరు అని మంది ముందట మదన పడుతరు. వాల్లను ‘గుమ్మిల ఇత్తులు గుమ్మిలనే ఉండాలె, గూటాలోలె బిడ్డలుండాలె’ అనే రకం మనుషులు. గుమ్మి అంటే పూర్వకాలం ధాన్యం నిలువ చేసికొనే ఒక పరికరం. అందులో వడ్లు తగ్గిపోవద్దు అంటే వాటిని బియ్యంగా మార్చి వండద్దు గాని గూటాలోలె అంటే దొడ్డు బలిష్టంగా బిడ్డలు వుండాలె అనుకునుట అన్నట్టు. ఇలాంటోల్లు ఇంకా ఏం చేస్తరంటే ‘కుప్పకు అగ్గిపెట్టి ప్యాలాలు ఏరుకున్నట్టు’ అంటరు. అంటే వరికుప్పలు దాన్యం కుప్పలకు అగ్గి పెడితే అందులోంచి బోలు ప్యాలాలు వస్తే ఏరుకుని తినాలన్నట్టు లోభి మనస్తత్వం ఉన్నవాల్లు ఇలా అంటరు. ఇసొంటోల్లకు ‘తెలివి తక్కువ ఆకలి ఎక్కువ’ అని కూడా అంటరు. కుప్పకు అగ్గి పెడితే అంత బూడిద అయితది కాని తెల్వక ఇలా చేస్తారని అంటరు. ఎలాగైనా పిశినాశి పిశినాశిలే. వీళ్లు మారాలన్నా మారరు. అయితే వీల్లను ‘గంగలో మునిగినా కాకి హంస అయితదా’ అనుకుంటరు.
– అన్నవరం దేవేందర్, 9440763479