ధరలను తగ్గించకుంటే కేంద్ర ప్రభుత్వం ఇంటికే : ఐద్వా

నవతెలంగాణ – మట్టెవాడ
కేంద్రప్రభుత్వం పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించకుంటే మహిళలంతా బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని ఐద్వా వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నలిగంటి రత్నమాల పిలుపునిచ్చారు. వరంగల్‌ జిల్లా ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్‌ హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌లో కూరగాయల దండలతో నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యవసర వస్తువుల ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని అంటాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పుడు ధరల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని హామీనిచ్చి నేడు ఆ చట్టాన్ని కాలరాస్తోందన్నారు. దేశ వనరులు, సంపద, ఆర్థిక స్వావలంబనాన్ని, నిత్యవసర వస్తువులను సహితం అంబానీ, అదానీలకు ప్రధాని మోడీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు వంట గ్యాస్‌ ధర రూ.450 ఉంటే నేడు రూ.1250 ఉందన్నారు. నిత్యం వాడుకునే టమాటా, మంచి నూనెలు, అల్లం, ఎల్లిగడ్డ.. తదితర కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు మూడు పూటలా తినే ఆహారాన్ని రెండు పూటలకే కుదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రేషన్‌ షాపుల్లో నాలుగున్నర కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటూ పేదలు తింటున్న తిండిపై ధరలు పెంచి మధ్య దళారీలకు దోచిపెట్టడం సరి కాదన్నారు. రేషన్‌ షాపుల ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వం 14 రకాల నిత్యవసర సరుకులు ఇస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో రేషన్‌ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఆరోగ్యంపై అంతర్జాతీయ ఆహార సంస్థ ఆరోగ్య సంస్థలు వెంటనే సర్వేలు చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌ రేణుక, టి. భవాని, ఎం. సునీత, సుభద్ర, రాజేశ్వరి, ప్రీతి, శారద, రాజక్క, రాజ కళ, తదితరులు పాల్గొన్నారు.