– 24 గంటల ఆశ వర్కర్ల నిరాహార దీక్ష ప్రారంభం
– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యం.యాదగిరి
నవతెలంగాణ-సంగారెడ్డి
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టిడిస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి హెచ్చరించారు. శనివారం సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆశాల సమ్మె పోరులో భాగంగా 24 గంటల నిరవధిక దీక్షల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పే ప్రభుత్వం ఆశా వర్కర్లను పర్మినెంట్ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్లుగా వ్యవహారించడం సరైందికాదన్నారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ప్రభుత్వం ఆశాల సమ్మె పట్ల కాలయాపన చేయకుండా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాబురావు, ఆశ వర్కర్ల జిల్లా నాయకులు వరలక్ష్మి, వీరమని, శారద, అనిత, అమతమ్మ, విజేతా, దీవెన, ప్రమీల, జ్యోతి, సునీత, సబిత, అరుణ, భారతి తదితరులు పాల్గొన్నారు.