జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– పెద్దపల్లిలో ఆందోళన.. కార్మికుల వంటావార్పు
నవతెలంగాణ – పెద్దపల్లి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, మున్సిపల్‌ కార్మికులకు ఇస్తున్న విధంగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఆదివారం, ఇతర సెలవులు ఇవ్వాలన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్‌ పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లతో నెల రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. పెద్దపల్లి జిల్లాలో మూడు నెలలుగా బకాయి వేతనాలు ఉన్నాయని.. అధికారులకు, ఉద్యోగులకు నెలనెలా వేతనం వస్తేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ కార్మికులకు మూడు మాసాల నుంచి వేతనాలు లేకుండా ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు వేతనాలు పెంచుకోవడానికి, నెల నెలా తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయిగానీ గ్రామాల్లో పనిచేస్తున్న పేద కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి, వేతనాలు పెంచడానికి చేతులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, పాదయాత్రలో పెట్టిన మిగతా డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ జి.జ్యోతి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.మహేశ్వరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కళ్ళేపల్లి అశోక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిపెళ్లి రవీందర్‌, బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష పాల్గొని సంఘీభావం తెలిపారు. గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.కాజా, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, ఎం.రామాచారి తదితరులు పాల్గొన్నారు.