హామీలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా

– సీఎం రేవంత్‌రెడ్డికి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తాననీ, తన రాజీనామాకు సంబంధించి స్పీకర్‌ ఫార్మాట్‌లో ఓపెన్‌ లెటర్‌ పంపిస్తున్నానని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేయకున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలవకున్నా రాజీనామా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పడే చెబుతున్నారనీ, అలా చేరే ఎమ్మెల్యేలందరికీ హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహించబోతున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్‌, హరీశ్‌ తీరుపై తనకు అనుమానం కలుగుతోందన్నారు. హరీశ్‌రావుతో చాలెంజ్‌కి దిగి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లోషిండేను తయారు చేసుకునేందుకే ఈ నాటకాలన్నారు. హరీశ్‌రావుతో చాలెంజ్‌ వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని నిలదీశారు. పెద్దోళ్లపై రాయి వేస్తే పెద్దోడిని అవుతానని రేవంత్‌ అనుకుంటున్నారనీ, మోడీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదని చెప్పారు.