– ప్రతిపక్షాల ఎన్నికల క్యాంపెయిన్ బలహీనం చేసేందుకు కుట్ర
– రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేస్తున్న కేంద్రం
– బీజేపీని గద్దెదించడమే మా రాజకీయ కర్తవ్యం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు
– తెలంగాణలో ఆ పార్టీ ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా చూడాలి సీఎం రేవంత్‌రెడ్డికి సూచన
– ఓటమి భయంతోనే కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, నీతి, నిజాయితీని రక్షించుకోవడం కోసమే మా ప్రధాన పోరాటం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రాజ్యాంగ మౌలిక విలువల పునాదులను ధ్వంసం చేస్తున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే వాటినికాపాడుకోలేం. దేశ భవిష్యత్తు అంధకారంలోకి పడిపోతుంది. దేశాన్ని రక్షించుకోవడం కోసమే ప్రతిపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. బీజేపీకి 370, ఎన్డీయే కూటమికి 400కుపైగా సీట్లు అంటున్నారు ప్రధాని మోడీ. బీజేపీకి భయం పట్టుకుంది. 2019లో వచ్చిన ఫలితాలు రావేమోననే భయంలో ఉన్నది. అందుకే ఈ నినాదాన్ని ముందుకు తెచ్చింది. భయం లేకుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. ఓడిపోతామనే భయంతోనే వారిని అరెస్టు చేశారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గద్దెదించడం తక్షణ రాజకీయ కర్తవ్యం. బీజేపీ మతోన్మాద విధానాలను ప్రశ్నిస్తూ విస్తారంగా దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయాలని మా పార్టీ నిర్ణయించింది.’అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు చెప్పారు.
శనివారం టి.జ్యోతి అధ్యక్షతన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం, ఆదివారం చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను కకావికలం చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్నదన్నారు. ప్రతిపక్షాల ఎన్నికల క్యాంపెయిన్‌ను బలహీనపరిచే చర్యలు తీసుకుంటున్నదని, ప్రతిపక్ష నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి బీజేపీ టికెట్లు ఇస్తున్నదని విమర్శించారు. బీజేపీకి బలముంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకోవడం లేదంటే, ఈడీ, సీబీఐ, ఐటీని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం, వినకుంటే అరెస్టు చేసి జైలులో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘అవినీతిపరులు బీజేపీలో చేరితే నీతిపరులవుతున్నారనీ, నీతిపరులు బయట ఉంటే అవినీతిపరులవుతున్నారంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు’ అని రాఘవులు గుర్తుచేశారు. నీతికి నిర్వచనాన్ని బీజేపీ మార్చివేసిందన్నారు. బీజేపీలో ఉంటే నీతిపరులు, లేకుంటే అవినీతిపరులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దాన్ని సహించేది లేదన్నారు. బీజేపీకి భయం లేకుంటే ఎన్నికల తేదీలు ముందే తెలుసు కాబట్టి ప్రధాని దేశమంతా సుడిగాలి పర్యటన చేశారని గుర్తు చేశారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారనీ, తెలంగాణ, ఏపీలోనూ పర్యటించారని చెప్పారు. ఎన్నికల బాండ్లలో అత్యధిక భాగం, రూ.6,566 కోట్లు బీజేపీకి వచ్చాయని వివరించారు. అధికారంలో ఎవరుంటారు, ప్రతిపక్షంలో ఎవరుంటారనేది తమకు ముఖ్యం కాదనీ, దేశంలో ప్రజాస్వామ్యం బతకాలనీ, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఆర్థికంగా గొప్ప ముందడుగు వేశామని బీజేపీ చెప్తున్నదన్నారు. బ్రిటీష్ వారి కాలం కంటే ఇప్పుడు అసమానతలు ఎక్కువయ్యాయంటూ ఓ సంస్థ ప్రకటించిందన్నారు. దేశంలో రాజ్యాంగ మౌలిక విలువలను రక్షించుకోవాలనీ, ప్రజలు ఆ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తున్నదనీ, మతోన్మాద వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని నిలువరించాలనీ, ఈ రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
ఫోన్‌ట్యాపింగ్ అప్రజాస్వామికం : ఎస్ వీరయ్య
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించారు. వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగిస్తుందన్నారు. ట్యాపింగ్‌కు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలంటే కేంద్రం అనుమతి కావాలని చెప్పారు. ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పోలీసులే చేశారా? లేదా గత ప్రభుత్వమే ట్యాపింగ్ చేయించిందా? అన్నది విచారణలో తేలాలనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం స్పందించడం లేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మత్తులు చేపట్టాలంటూ బీఆర్‌ఎస్ నేతలంటుంటే, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ పగుళ్లు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులంటున్నారని వివరించారు. ఎన్‌డీఎస్‌ఏ అధికారులు, నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. మేడిగడ్డలో అవినీతి, డిజైన్‌లో లోపాలు, ఎల్‌అండ్‌టీ సంస్థ వైఫల్యంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ముడుపుల కోసం ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. దాన్ని తేల్చాలని కోరారు. వేసవితో పాటు కరువు ప్రారంభమైందని, కరువు పీడిత ప్రాంతాల్లో ఒక్క మంత్రి పర్యటించలేదనీ, రైతులకు భరోసా కల్పించలేదన్నారు.
ప్రాజెక్టులు, చెరువుల్లో నీళ్లు లేవనీ, భూగర్భ జలాలు పడిపోయాయని వివరించారు. రైతులు నష్టపోకుండా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని రైతాంగాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ మాట నిలబెట్టుకోవాలని కోరారు. 19 జిల్లాల్లో లక్షల కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయనీ, ఇందిరమ్మ ఇండ్ల కింద వారికి రూ.ఐదు లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులపై కేసులను రద్దు చేస్తామంటూ సీఎం హామీ ఇచ్చారనీ, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరణి భూ సమస్యలు అలాగే ఉన్నాయనీ, బాధితులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ధరణిలోని లోపాలను సరి చేయాలన్నారు. గొర్రెలు, మేకల కుంభకోణం జరిగిందనీ, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు. శాస్త్రీయ పద్ధతిలో కార్మికుల కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయముందని, పార్లమెంటు ఎన్నికల్లో వైఖరిపై సీపీఐ, సీపీఐ(ఎం) సంప్రదించుకుంటాయని వివరించారు. పరిణామాలను చూసి ఎవరికి మద్దతివ్వాలో తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని విలేకర్లు అడిగిన ప్రశ్నకు వీరయ్య సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.