– కాంగ్రెస్ ప్రభుత్వానిది చిల్లర ప్రచారం
– మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో చూపిస్తున్నారు..
– వరద వచ్చేనాటికి బ్యారేజీని పునరుద్ధరించాలి
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– ప్రాజెక్టు పరిశీలించిన బీఆర్‌ఎస్ బృందం
– కుంగిన 20వ పిల్లర్‌ను పరిశీలించని నేతలు
నవతెలంగాణ-భూపాలపల్లి
”కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోంది.. రాష్ట్రం, రైతులపై పగ పెట్టుకోవడం సరికాదు.. రాజకీయంగా తమపై కోపం ఉంటే తీర్చుకోండి.. కానీ రైతులకు మాత్రం న్యాయం చేయాలి.. వర్షాకాలం వరద వచ్చేనాటికి మేడిగడ్డ బ్యారేజ్‌ని పునరుద్ధరించా లి” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడాలని, 1.6 కిలోమీటర్ విస్తీర్ణంగల బ్యారేజ్‌లో కేవలం 50 మీటర్ల పరిధిలో సమస్య ఉందని దానిని పరిష్కరించాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాహాదేవ్‌పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ సందర్శించారు. కుంగిన 20వ పిల్లర్ దగ్గరకు చేరుకున్నప్పటికీ క్షుణ్ణంగా పరిశీలించకుండా వెనుతిరిగారు. అన్నారంలో మాజీ మంత్రి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రాజెక్టుపై పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. వాస్తవాలు తెలియజేసేందుకే చలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామన్నారు. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ను సందర్శించామని చెప్పారు. 1.6 కిలోమీటర్ల విస్తీర్ణం గల బ్యారేజ్‌లో 50 మీటర్ల పరిధిలో మాత్రమే ఒక సమస్య వచ్చిందని చెప్పారు. 85 పిల్లర్‌లలో ఒక పిల్లర్‌లో సమస్య ఉందన్నారు. నిపుణులు బ్యారేజ్‌ని రిపేర్ చేయొచ్చని చెబుతున్నారన్నారు. కానీ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సత్వరమే బ్యారేజి మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వచ్చే వానాకాలం లోపల మరమ్మతు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. నీళ్లు లేక ఇప్పటికే కరీంనగర్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోండని సూచించారు.
అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ను సందర్శించామని, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బరాజ్ అన్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల టన్నెల్స్, 1500 కిలోమీటర్ల కెనాల్స్ కలిపితే కాళేశ్వరం అని తెలిపారు. మూడు పిల్లర్ల వద్ద సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో పంటలు ఎండి పోకూడదంటే కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీపై బురద జల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయని, నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయని.. తాము ఏనాడూ రాజకీయం చేయలేదని చెప్పారు.
మేడిగడ్డను కూల్చేందుకు కుట్ర : హరీశ్‌రావు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేయడం లక్ష్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కూల్చేందుకు కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. అన్నారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతులతో రాజకీయం చేయరాదని అన్నారు. మేడిగడ్డ పర్యటనతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మేడిగడ్డను త్వరలోనే రిపేర్ చేస్తామనడంతో తమ పర్యటన విజయవంతమైందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రాగానే మేడిగడ్డ పిల్లర్లు రిపేరు చేయిస్తామని మంత్రి చెబుతున్నారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలలో బద్‌నామ్ చేసి ఎన్నికలలో రెండు సీట్లు సాధించడం కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. వర్షాకాలంలో ప్రాజెక్టును దెబ్బతీయాలనే కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతోందన్నారు. నల్లగొండలో కేసీఆర్ మీటింగ్ పెట్టగానే.. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పబోమని అసెంబ్లీలో తీర్మానం చేశారని అన్నారు. తాము మేడిగడ్డ అనగానే కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల యాత్ర చేపట్టారని విమర్శించారు. మెగా ప్రాజెక్టలు కట్టినప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజమని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదన్నారు. వెంటనే రాజకీయాలు మానుకొని రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాబోయే వర్షాకాలంలోపు మరమ్మతులు చేయించాలని కోరారు. కావర్ డ్యామ్‌ను ఏర్పాటు చేసి మేడిగడ్డలో నీరు నింపి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ పర్యటనలో మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినరు భాస్కర్, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మెన్లు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
టైర్ బ్లాస్ట్ కలకలం
బీఆర్‌ఎస్ తలపెట్టిన ‘చలో మేడిగడ్డ’ టూర్‌లో బస్సు టైర్ బ్లాస్ట్ కావడం కలకలం రేపింది. మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్‌ఎస్ నేతల బస్ టైర్ మార్గ మధ్యలో బ్లాస్ట్ అయింది. ఆ సమయంలో బస్‌లో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన జనగామ దగ్గరలో జరిగినట్టు సమాచారం.