– డా.కృష్ణ చైతన్య స్వామి
– ప్రతి రైతు బాగుండాలని 32 రోజులుగా కఠోర దీక్ష
– అనేక దివ్యక్షేత్రాల మట్టిని సేకరించి ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఆయన ఓ సాధారణ పూజారి. కానీ సమాజం కోసం ప్రతి నిత్యం శ్రమించే మహర్షి. వారే డా.కృష్ణ చైతన్య స్వామి. రైతులు బాగుండాలని గత కొన్ని సంవత్సరాలనుండి మృగశిర కార్తె నాడు అనేక దివ్య క్షేత్రాల నుండి మట్టిని సేకరించి, ఆ మట్టికి ప్రత్యేక పూజలు చేసి రైతులకు ఏరువాక పౌర్ణమి నాడు అందించి, వారికి మంచి పంటలు పండాలని దీవిస్తున్నారు. ఈ సందర్భంగా చైతన్య స్వామి శనివారం మాట్లాడారు. రైతు బాగుంటే లోకంబాగుంటుందని, అందుకే ప్రతి సంవత్సరం రైతు శ్రేయస్సు కోసం మృగశిర కార్తె నుండి ఏరువాక పౌర్ణమి వరకు పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన మట్టికి ప్రతిరోజు భూవరాహ పూజ చేసి ఆ మట్టిని ఏరువాక పౌర్ణమి నాడు రైతులకు అందజేస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం లక్షల మంది రైతులకు ఈ దివ్య ప్రసాదాన్ని అందించాలని నృసింహ సేవా వాహిని ఆకాంక్ష, ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైతన్నల ఘోస వర్ణనాతీతంగా ఉన్నదని, పంటలు పండక ఒకరు పండించిన ఆ కొద్ది పంటలకు సరైన గిట్టుబాటు ధరలు రాక ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఇలా ఎంతో మంది రైతన్నలు పంట పొలంలోనే ప్రాణాలు వదులుతు న్నారన్నారు. ఇకమీదట రైతన్నల కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, రైతుకు మంచి రోజులు రావాలని, రైతే రాజు అన్న నినాదం నిజం కావా లని నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నా రు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి, శ్రీధర్ శర్మ, అర్చకులు, నృసింహ సేవా వాహినిసభ్యులు తదితరులు పాల్గొన్నారు.