– పార్టీ విధానం ఇంతే : నేతలపై బీజేపీ జాతీయ (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ఫైర్
– ఆరు జోన్లుగా తెలంగాణ
– ఇన్‌చార్జీలుగా ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు
– జిల్లాల బాధ్యులుగా మహారాష్ట్ర, కర్నాటక నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎవరికోసమే పార్టీ విధానాలను మార్చుకోదనీ, పార్టీలో ఉండే వారు ఉంటారు…పోయేవారు పోతారని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, తదితర నేతలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణను మొత్తం ఆరు జోన్లుగా విడగొట్టి ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన కీలక నేతలకు జోన్ల బాధ్యతలను అప్పగించింది. కేంద్ర మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. జిల్లాలకు కర్నాటక, మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలు ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు. ఆ సమావేశంలో బీఎల్ సంతోశ్ కీలక వాఖ్యలు చేశారు. ముప్పై ఏండ్ల నుంచి పార్టీ ఎలా కొనసాగిందో ఇప్పుడూ అలాగే నడుస్తుందనీ, ఇప్పుడు కొత్తగా విధానాలు మార్పుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని నొక్కిచెప్పారు. పార్టీలో ఉండేవారు ఉంటారు..పోయే వారు పోతారు అని వ్యాఖ్యలు చేశారు. మోడీ-కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు? నేతలు అనవసర మాటలు తగ్గించండి..తప్పుడు ప్రచారాల్లో నమ్మి అందులో కొట్టుకుపోకండి అంటూ ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..మోడీ బీజేపీ ట్రంప్ కార్డు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనీ, దాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. ఎన్నికల వరకు 18 కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 20లోపు ఆరు కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు.
నేడు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ : కిషన్‌రెడ్డి
బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌ను శుక్రవారం ఘట్ కేసర్ మండలంలోని వీబీఐటీలో నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ఆ సమావేశం ప్రారంభమవుతుందనీ, ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. చాలా ఏండ్ల తర్వాత కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 1000 మంది ముఖ్య నాయకులు ఈ మీటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తంపై ప్రధానంగా చర్చిస్తామనీ, పలు తీర్మానాలు చేస్తామని చెప్పారు. ఈనెల పదో తేదీన ఆదిలాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారన్నారు. 27న కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్రనగర్‌లో జరిగే సభకూ అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 20, 21 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు.