శరీరంలో అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఏదో ఒక వ్యాధి రూపంలో వెంటనే బయటపడుతుంది. శరీరానికి అందాల్సినవి సరిగ్గా అందకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే ఈ సమస్యలను ముందుగానే గుర్తిస్తే నివారణ చర్యలు కూడా అంతే సులభంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలాంటిదే శరీంలో ప్రోటీన్ లోపం ఒకటి. మనలో చాలా మంది ఏదో తినాలి కాబట్టి తింటున్నాం అన్న కోణంలోనే ఆలోచిస్తారు. అందుకే శరీరంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ప్రోటీన్ లోపాన్ని గుర్తించి ఆహారంలో మార్పులు చేసుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే దీర్ఘకాలంలో ఇది పెద్ద అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకవేళ శరీరంలో ప్రోటీన్ లోపం తలెత్తితే ముందుగానే పలు రకాల హెచ్చరికలు జారీ చేస్తుంది. అందులో ఒకటి జుట్టు సమస్యలు. ఉన్నట్లుండి జుట్టు భారీగా రాలుతున్నా, జుట్టు బలహీనంగా మారి విరిగిన లక్షణాలు కనిపించినా ప్రోటీన్ లోపం ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. అలాగే గోర్లు కూడా బలహీనంగా మారి, విరిగిపోతున్నా మీకు ప్రోటీన్ లోపం ఉన్నట్లే అర్థం. శరీరంలో ప్రోటీన్ లోపం ఉందడానికి మరో లక్షణం.. జీవక్రియ మందగించడం. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవదు. ఉన్నట్లుండి బరువు పెరిగినా దాని అర్థం ప్రోటీన్ లోపం ఉన్నట్లే.
అలాగే శరీరంలో ప్రోటీన్ స్థాయి తగ్గితే.. జలుబు, దగ్గు సమస్య వెంటాడుతుంది. దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే ప్రోటీన్ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అయితే ప్రోటీన్ లోపం ఉన్నట్లు మీకు అనుమానం వస్తే మీ డైట్‌లో గుడ్లను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో సాయంత్రం స్నాక్స్ రూపంలో కోడి గుడ్డు తీసుకుంటే ప్రోటీన్ లోపానికి చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లు ప్రోటీన్‌కు పెట్టింది పేరు.