నవ్వుతూ జాలీగా ఆటలు ఆడుతూ సంతోషంగా గడపాల్సిన చిన్నారులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లతో కుస్తీలు పడుతున్నారు. ఒకప్పుడు స్కూల్ నుంచి వచ్చి గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకునే వారు ఇప్పుడు ఫోనుల్లో, టీవీల్లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. అయితే ఇది చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల్లో డిప్రెషన్‌ను కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించొచ్చంటున్నారు.
ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో సతమతమవుతున్నారు. అయితే ఇది కేవలం పెద్దలకే అనుకుంటే పొరబడినట్లే, చిన్నారులు కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారు.
మీ చిన్నారులు కొన్ని రోజుల నుంచి విచారంగా ఉన్నా, ఇతరులతో కలవడానికి ఆసక్తి చూపించకపోయినా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లే అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు ఒంటరిగా ఉండడానికి ఆసక్తి చూపిస్తున్న చిన్నారుల విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
ఇక పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటున్నా, ఒంటరిగా కూర్చొని తామే ప్రశ్నలు వేసుకొని, తామే సమాధానాలు చెబుతుంటే కూడా పిల్లల మానసిక స్థితిలో మార్పు వచ్చినట్లు గుర్తించాలి. వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి.
ఏ కారణం లేకపోయినా చిరాకు పడుతున్నా, చిటికిమాటికి కోపంగా ఉంటున్నా, చేతిలోని వస్తువులను విసిరిగొడుతున్నా ఇవి చిన్నారుల్లో డిప్రెషన్ తాలుకు లక్షణాలుగా భావించాలి.
ఇక చిన్నారులు నిత్యం నిద్రపోతున్నా, ఏ పనిపై ఆసక్తి చూపించకపోతున్నా ఇది డిప్రెషన్ లక్షణంగా భావించాని నిపుణులు చెబుతున్నారు.
ఇవి పాటించండి..
చిన్నారులు డిప్రెషన్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా వారిని స్మార్ట్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు బయట ఆడుకునేలా ఎంకరేజ్ చేయాలి. అలాగే పెద్దలు సైతం చిన్నారులతో నాణ్యమైన సమయాన్ని గడపాలని సూచిస్తున్నారు. పార్కులకు ఎగ్జిబిషన్స్ వంటి వాటికి తీసుకెళ్తుండాలి.