వారికి భరోసా ఇస్తే…

Assure them...వేణు గీతికకు ప్రేమతో…
నాన్న.. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఇవ్వాళ ఆదివారం కదా ఎక్కడికైనా ఫ్రెండ్స్‌తో వెళ్తున్నావా? కన్నా నీకో అత్యంత ముఖ్యమైన విషయం చెప్పనా.. నిన్న మన ఇంటికి ఓ అమ్మాయి వచ్చింది. పెళ్లి అయ్యింది. చిన్న వయసు కాబట్టి అమ్మాయి అన్నాను. నేను ఎవరో తనకు తెలియక పోయినా, నా గురించి ఎవరో చెప్పారట వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో చాలా సేపు చెప్పలేదు. నెమ్మదిగా మాటలు కలుపుతూ వివరాలు అడిగాను. ఏడవటం మొదలు పెట్టింది.
కొంచెం ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు చెప్తోంది.. ‘ఏమిటో అంటీ చాలా ఒంటరిగా అనిపిస్తోంది. నాకు ఎవరు లేరనిపిస్తోంది. ఈ నరకం భరించలేకపోతున్నాను’ అంది. చిన్న తనం నుండి తన జీవితంలో జరిగిన వన్నీ అడిగాను. చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న తన చెల్లికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారట. అన్న దమ్ములు అంతే ఆట. తనను పట్టించుకోరంట. ఒంటరిగా అనిపించి ఒక్కోసారి చనిపోవాలనుకునేదంట. డిగ్రీ పూర్తి చేయగానే పెళ్లి చేశారు. అత్తగారి ఇంట్లో సమస్యలు. భర్త సహకారం లేదు. అక్కడా ఒంటరితనమే. నేను తనకు చాలా ధైర్యం చెప్పాను. ఎన్నో ఉదాహరణలు చెప్పాను. అప్పుడు అన్నది ‘ఆంటి నా మనసు కొంచం సేద తీరింది. మీకు అప్పుడప్పుడు ఫోన్‌ చేయవచ్చా, కలవొచ్చా అని అడిగింది. ఏదైనా పర్వాలేదు అని చెప్పాను.
నాన్న.. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒంటరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. అలాంటి సమయంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు కావాలి. సాధారణంగా ఇటువంటి వాళ్లు మోసపోయే అవకాశాలు ఎక్కువ. వీళ్ళ బలహీనత ఎదుటివారికి అవకాశంగా మారుతుంది. అందుకే ఇటువంటి వారు ఎదురైనప్పుడు జీవితంపై ఆశ కల్పించాలి. ఎవరూ లేకపోయినా నీకు నువ్వుగా బతకాలని చెప్పాలి. నీకోసం ఒకరు ఉండటం కాదు, పదిమంది కోసం నువ్వు ఉండాలి. మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ, ఇష్టమైన రంగంలో రాణించటానికి కృషి చేసి ఆదర్శంగా నిలవాలని చెప్పాలి. ఇటువంటి వారు భవిష్యత్తులో నీకు ఎదురు కావొచ్చు. ధైర్యం చెప్పి, జీవితం మీద ఆశ కల్పించు. ఒక మనిషి జీవితాన్ని నిలిపిన ఆనందం మాటల్లో చెప్పలేము. తప్పకుండా ఇటువంటి వారికి నీ వంతు సహాయం చేస్తావని, వారికి అవసరమైన ప్పుడల్లా అండగా ఉంటావని ఆసిస్తూ..