కూలగొడతామంటే కట్టేసి కొడతారు

– కేసీఆర్‌ పాపాల బైరవుడు..ఆయన మళ్లీ సీఎం కాలేరు
– ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజలు ఊరుకుంటారా?
– ఇంద్రవెల్లి గడ్డ నుంచే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం : ముఖ్యమంత్రి
– బీఆర్‌ఎస్‌కు ఎంపీ సీట్లు.. మోడీకి అమ్ముకోవడానికే
– ఈ ప్రాంతానికి ఏమీ ఇవ్వని మోడీకి ఓటెందుకు వేయాలి..?
– మరోపక్షం రోజుల్లో 15వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ
– ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటాం.. : తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
”మరో ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందని అక్కడక్కడ కొందరు మాట్లాడుతున్నారు.. నీ అయ్య జాగిరా.. ఎవర్రా పడగొట్టేది.. వేలాది మంది యువకులు ఇక్కడ ఉన్నారు.. పడగొడతా మన్న వారిని ఊర్లలో వేపచెట్టుకు కట్టేసి కొడతారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతా మంటే వారు ఊరుకుంటారా.. నీ కాందాన్‌ మొత్తం వచ్చినా బోర్లేసి తొక్కుతారు.. కేసీఆర్‌.. నిత్యానంద స్వామిలాగా ఒక దీవి కొనుక్కొని అక్కడ సీఎంగా ఉండాలి..లేదంటే ఆయన ఫామ్‌హౌస్‌కైనా సీఎం కావాలి.. తప్పితే ఈ రాష్ట్రానికి ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు.. రైతులు, ఆదివాసీలు, దళితులు, నిరుద్యోగులను నిలువునా ముంచిన పాపాల భైరవుడు కేసీఆర్‌” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి శుక్రవారం తెలంగాణ పునర్నిర్మాణం పేరిట కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఇంద్రవెల్లి నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఇక్కడ్నుంచే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. అంతకుముందు కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ రూ.7కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఇంద్రవెల్లి సభలో సీఎం ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలవాలని అంటోందని.. ఎంపీ సీట్లు గెలిస్తే మోడీకి అమ్ముకుంటారని ఆరోపించారు. ఎన్‌డీఏకు మోడీ ఉన్నారని.. ఇండియా కూటమికి తాము ఉన్నామని.. ఎటూ లేని కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలని అన్నారు.
రాష్ట్రం మీద పడి దోచుకుతిన్నారు…
గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేండ్లలో అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా సమీక్ష చేశారా.. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఏనాడైనా చర్చించారా.. నీ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా.. నీ బిడ్డల కోసమే సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చారా అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. పదేండ్లలో కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన సాగించారని, రాష్ట్రం మీద పడి దోచుకుతిని విధ్వంస రాష్ట్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిందని, వీటితో కడెం ప్రాజెక్టుకు కనీస మరమ్మతు చేయలేదని, సదర్‌మాట్‌ కూడా కట్టలేదని అన్నారు. మిషన్‌ భగీరథ పేరిట రూ.40వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ పథకం బాగా చేసినట్లయితే.. తాగునీటి అవసరాల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.65వేల కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి లక్ష కోట్లు దోచుకున్నారని..హెలిక్యాప్టర్‌లో వస్తుంటే ఈ ప్రాంతమంతా ఎడారిలా కనిపిస్తోంది.. ఎక్కడ నీళ్లిచ్చారో కేసీఆర్‌ చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో కూతురు ఓడిపోయినప్పటికీ దోపిడీ, పదవుల మీద వ్యామోహంతో మళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చారని.. ఇక్కడి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రగతి భవన్‌ పేరిట గడి కట్టుకొని గద్దర్‌ అన్నను కూడా రానీయకుండా అడ్డుకు న్నారని, ఆయన ఉసురు తగిలినందుకే ప్రభుత్వం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున కేటాయించి ఇండ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్యఆరోగ్యశాఖలో 7వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. మరోపక్షం రోజుల్లో 15వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పిస్తామని హామీనిచ్చారు.
ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఏనాడైనా ఆలోచించారా అని సీఎం ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే తాము రూ.10లక్షలతో బీమా సౌకర్యం కల్పించామని.. త్వరలోనే రూ.500కే సిలిండర్‌ సౌకర్యాన్ని ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని తుమ్మిడిహేటీ, సదర్‌మాట్‌, కుప్టి ప్రాజెక్టులు నిర్మిస్తామని, కడెంకు మరమ్మతులు చేపడుతామని భరోసా ఇచ్చారు. తండా, గూడేలకు తాగునీరు, విద్యుత్‌, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఒక్కరికైనా ఖాతాలో వేశారా అన్నారు. ఈ ప్రాంతానికి ఏమీ ఇవ్వలేని మోడీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, త్యాగధనుల కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఆదిలాబాద్‌ గడ్డ నుంచే కాంగ్రెస్‌ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండ సురేఖ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్‌, వివేక్‌వెంకటస్వామి, ఆది శ్రీనివాస్‌, వేం నరేందర్‌రెడ్డి, డిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లు రవి, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, బల్మూర్‌ వెంకట్‌, మాజీ ఎంపీ హన్మంతరావు, పార్టీ మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, విశ్వప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.