మా కార్యకర్తలను ఇబ్బంది చేస్తే వారిని ఊర్లో లేకుండా చేస్తా

 – ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి.
నవతెలంగాణ – మాక్లూర్: గ్రామాలలో మా నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వారిని గ్రామాల్లో, ఊర్లలో లేకుండా చేస్తానని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని కృష్ణ నగర్, గంగారమంద, రాంపూర్, గద్వాల్ క్యాంప్, రామస్వామి క్యాంప్, చిన్నాపూర్, మామిడి పల్లి, రామచంద్ర పల్లి గ్రామాలలో గడపగడప ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ పేదల భూములను కబ్జా చేశారని, ఇక్కడున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పేదలకు డబల్ బెడ్ రూమ్ ఒక్కటి కూడా కట్టలేదని, తాను కమిషన్లకు, కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. కొన్ని రోజుల్లో జీవన్ రెడ్డిని ఆర్మూర్ నుంచి ప్రజలు తరిమి కొడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూసి బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓడిపోతాయని భయం మొదలైందని అన్నారు. ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.15000  రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, అలాగే వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని తెలిపారు, కళ్యాణ లక్ష్మికి ఒక్క లక్ష నుట పదహారు తో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. చేయూత పథకం కింద 57 సంవత్సరాలు నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ నెలవారి పింఛన్ రూ. 4000 ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ సంఘటన అధ్యక్షులు గంగాధర్ గౌడ్, జిల్లా నాయకులు డేగ పోశెట్టి, రాజేశ్వర్, అంజయ్య, వినోద్, జైల్ సింగ్, దన్యల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.