‘ప్రపంచ స్థాయి సినిమా చేయాలంటే ఖర్చు తప్పడం లేదు. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ఆ ఖర్చును రాబట్టుకోవాలి. అదనపు షోలు వేసుకోవడం అనేది ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఉంది. బెనిఫిట్ షోలు వేయకపోతే నిర్మాత ఖర్చు పెట్టలేడు’ అని సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో చిత్ర ప్రముఖులు కలిశారు. ఈ నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుదల అనేవి ఉండవని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అనే అభిప్రాయాన్ని మురళీ మోహన్ వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మరోసారి పున: సమీక్షిస్తే బాగుంటుందన్నారు. ఆయన మాట్లాడుతూ,’టికెట్ ధరల పెంపు, అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టమే. చిత్ర పరిశ్రమ సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా మా విన్నపాలను ఆలకించారు. ఫస్ట్ షోకు చిత్ర యూనిట్ వెళ్ళకపోతే సినిమాను అంచనా వేయలేం. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరం. అందుకు అందరం చింతిస్తున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరకు మన సినీ ప్రముఖులు వెళ్ళనున్నారు. నంది అవార్డుల అంశంపై పవన్‌కళ్యాణ్‌తో మాట్లాడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాకు సూచించారు. కళాకారుడికి ప్రభుత్వ గుర్తింపు చాలా అవసరం. కళాకారుడికి డబ్బు కన్నా గుర్తింపే ముఖ్యం’ అని చెప్పారు.