ఏకపక్ష నిర్ణయాలే ఇలా అయితే జేపీసీ నుంచి తప్పుకుంటాం

– జగదాంబికా పాల్‌పై స్పీకర్‌కు ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ : వక్ఫ్‌ (సవరణ) బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పనితీరుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. జేపీసీ చైర్మెన్‌ జగదాంబికా పాల్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. జేపీసీలో తాము రాతిగోడగా మిగిలామని ఆంటూ ఇలాగైతే కమిటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వక్ఫ్‌ బిల్లుకు సంబంధించి సంబంధిత పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తామని జేపీసీ చైర్మెన్‌ జగదాంబికా పాల్‌ సోమవారం ప్రకటించారు. దీనిపై జేపీసీలోని ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ అభిమతం మేరకు బిల్లును ఆమోదించడానికి కమిటీ ఓ వేదికగా మారకూడదని అన్నారు. అప్రజాస్వామికంగా ‘మెజారిటీ’ అనే పదాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రక్రియను విస్మరిస్తోందని మండిపడ్డారు. సమావేశాల నిర్వహణపై జేపీసీ చైర్మెన్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు జరపాలని అనుకుంటున్నారని, అయితే సభ్యులు సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున ఇది ఆచరణ సాధ్యంకాదని తెలిపారు. జేపీసీ ప్రొసీడింగ్స్‌ను పాల్‌ బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ముందు కమిటీ సభ్యులతో చర్చించేలా చైర్మెన్‌ను ఆదేశించాలని ఓం బిర్లాను ప్రతిపక్ష ఎంపీలు కోరారు.