మ‌ట్టి ఖ‌ర్చు‌ల‌తో స‌రిపెడితే..మ‌ట్టి క‌రిపిస్తాం…

– పర్మినెంట్‌ చేయాల్సిందే..
– వెట్టిచాకిరి ఇంకెన్నాళ్లు
– రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన తెలంగాణ
అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్వర్యంలో
అంగన్‌వాడీల కలెక్టరేట్‌ ముట్టడి
– కలెక్టర్‌ కార్యాలయంలోకి
చొచ్చుకుపోయేందుకు యత్నం
– అడ్డుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం
– రెచ్చిపోయిన పోలీసులు…మహిళలని
చూడకుండా ఇడ్చూకెళ్లిన వైనం
– తొపులాటలో సొమ్మసిల్లిన అంగన్‌వాడీలు
గంటల తరబడి పోలీసులకు చెమటలు
– పట్టించిన అంగన్‌వాడీలు
– సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు
అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలింపు
‘పర్మినెంట్‌ చేయాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం రూ. 26 వేలు చెల్లించాలి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లించాలి’ ఇలా పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్‌ బయటకు వచ్చి తమ సమస్యలు తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని..లేదంటే మేము కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్తామని పోలీసులకు స్పష్టం చేశారు. అలెర్ట్‌ అయిన పోలీసులు అదనపు బలగాలను దింపారు. ఉద్రేకానికి గురైన అంగన్‌వాడీలు కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల ముందస్తు ప్రణాళికలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు అంగన్‌వాడీలు విశ్వపప్రయత్నం చేశారు. పోలీసులకు ముచ్చమటలు పట్టించారు. అంగన్‌వాడీల నుంచి నాయకులను తీసుకుపోయేందుకు పోలీసుల శక్తి సరిపోకపోవడంతో అదనపు బలగాలను దింపి ముఖ్యనాయకులు జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యాదయ్య, సీఐటీయూ నాయకులు జగదీష్‌, కవితను అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొంత మంది అంగన్‌వాడీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు దురుసగా ప్రవర్తిస్తూ అడ్డుకున్న అంగన్‌వాడీలను ఇడ్చూకెళ్లే క్రమంలో ఇద్దరు అంగన్‌వాడీలు సొమ్మసిల్లిపడిపోయారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మట్టిఖర్చులతో సరిపెడితమంటే ఊరుకునేది లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మట్టికరిపిస్తామని తెలంగాణ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్‌వాడీలను పర్మినెంట్‌ ఉద్యోగులుగా ప్రకటించేంత వరకు ఈ పోరాటం అగదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ జాయింట్‌ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీల అధ్వర్యంలో అంగన్‌వాడీలు బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు, హెల్పర్స్‌ తరలివచ్చారు. సుమారు 2 వేల మంది అంగన్‌వాడీలతో కలెక్టరేట్‌ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. అంగన్‌వాడీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ధర్నా కార్యాక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్‌వాడీలతో వెట్టి చేయించుకుంటున్న సీఎం కేసీఆర్‌ వారి బతుకుల గురించి ఆలోచన చేయడం లేదన్నారు. ప్రగతి భవన్‌కు పిలిచి ఒక పూట బువ్వపెట్టి పంపిస్తే సరిపోతుందా..! మూడు పూటల అంగన్‌వాడీ కుంటుబాలకు తిండిపెట్టే ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేసినట్టు అంగన్‌వాడీలను ఎందుకు చేయడం లేదని నిలదీశారు. అంగన్‌వాడీలకు ఓట్లు లేవా.. వారు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు కాదా అని ప్రశ్నించారు. 50 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి..పోయాయి కానీ అంగన్‌వాడీలు మాత్రం గ్రామాల్లో పనిచేసుకుంటూ ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలను నిలబెట్టడంలో కూల్చడంలో అంగన్‌వాడీల పాత్ర ఏంటో గత ప్రభుత్వాలు టీడీపీ, కాంగ్రెస్‌లకు తెలుసూ ఇక బీఆర్‌ఎస్‌కు చూపించే సమయం వచ్చిందన్నారు. అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే ఆహారభద్రత చట్టం ప్రకారం సెంటర్లలో భోజన పంపిణీ నిలిపివేయడం చట్ట రిత్యా నేరమని అంగన్‌వాడీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసు ్తందన్నారు. కార్మిక చట్టంలో భాగంగా సమ్మెకు వెళ్లే ముందు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చట్టాన్ని దిక్కరించినట్టు కాదా..! మీపై ఎందుకు చర్యలు తీసుకోకుడదని ప్రశ్నించారు. అంగన్‌వాడీలు సమ్మెలో ఉంటే అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన ప్రభుత్వానికి..అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించే సమయం లేదా అని ప్రశ్నించారు. ఎన్ని ఒత్తిళ్లు పెట్టిన పోరాటం ఆపేది లేదన్నారు. అంగన్‌వాడీలను పర్మినెంట్‌ ఉద్యోగులగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేసేంత వరకు ఉద్యమ కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. అంగన్‌వాడీ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా భవిష్యత్తులో ఉద్యమాలు చేపడుతామన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎన్నో ఏండ్లుగా అంగన్‌వాడీలు వెట్టిచాకిరి చేస్తూ బతుకుతున్నారని ఇంకెన్నాళ్లు చాకిరి చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలిచి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేశారు.