– సర్పంచుల పాత బకాయిలను వెంటనే చెల్లించాలి
– మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు సంతోష్ నాయక్, మాజీ సర్పంచ్ వడ్డే బాలయ్య
నవతెలంగాణ – కొత్తూరు
పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేయడం సబబు కాదని సర్పంచుల పోరం మండల మాజీ అధ్యక్షులు సంతోష్ నాయక్ అన్నారు. గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల పాత బకాయి బిల్లును వెంటనే చెల్లించాలని కోరుతూ చేపట్టిన సర్పంచుల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ ల ఫోరమ్ మండల మాజీ అధ్యక్షుడు సంతోష్ నాయక్, మాజీ సర్పంచ్ వడ్డే బాలయ్య తదితరులను సోమవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించకపోవడం అన్యాయమని మడ్డి పడ్డారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచ్ లను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పేరుతో గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమానికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడం సబబు కాదని హితవు పలికారు. బిల్లులు అందక తాము ఎంతో నష్టపోయామని అన్నారు. అప్పులు చేసి మరి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని సర్పంచులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.