కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే పదేళ్లు వెనక్కి

If you believe Congress and vote, you will go back ten years– ప్రాజెక్టును ఇసుక మీద కాక నెత్తి మీద కడతారా..?
– గ్యారెంటు లేని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి : మంత్రి తన్నీరు హరీశ్‌ రావు
నవతెలంగాణ-నెక్కొండ/ బొమ్మలరామారం
తెలంగాణలో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ మాయ మాటలు నమ్మి ఓటేస్తే.. రాష్ట్రం పదేండ్లు వెనక్కిపోతుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు, మోటార్లకు మీటర్లు తప్పవని, గ్యారంటీ లేని స్కీంలతో ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. శనివారం వరంగల్‌ జిల్లా నెక్కొండ, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్‌, బీజేపీలు ఎంతకైనా తెగిస్తున్నాయని, గతంలో ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోని ఈ నేతలు ఎన్నికలవేళ ఎక్కడలేని ప్రేమ ఒలకపోస్తున్నారన్నారు. మార్పు రావాలని కోరుతున్న కాంగ్రెస్‌ బూటకపు ప్రచారంతో విషవలయంలో పడిపోవద్దని ఓటర్లను అప్రమత్తం చేశారు. ఈ గడ్డమీద పుట్టిన బీఆర్‌ఎస్‌ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాలా? అని ప్రశ్నించారు. కేంద్రం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటే ప్రాణం ఉన్నంతకాలం మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్‌ తెగేసి చెబితే రాష్ట్రానికి రావాల్సిన రూ.28వేల కోట్లు నిలుపుదల చేసినట్టు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ క్లారిటీ ఇచ్చినట్టు చెప్పారు. నర్సంపేటలో పెద్దిని గెలిపించిన నెలరోజుల్లోనే నెక్కొండకు సివిల్‌ ఆస్పత్రి మంజూరుతోపాటు నెక్కొండను మున్సిపాలిటి చేయిస్తామన్నారు.
గ్యారెంటు లేని కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పాలి
యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి గ్రామంలో జరిగిన రోడ్‌ షోలో మంత్రి మాట్లాడుతూ.. రైతుల జోలికొస్తే ఊరుకునే పరిస్థితి లేదని, కేసీఆర్‌కు రైతులంటే ఎంతో ప్రేమని అన్నారు. ఆలేరు నియోజవర్గంలో ఐటీ పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కేసీఆర్‌ అద్భుతంగా కట్టించారన్నారు. ఆలేరు నియోజక వర్గంలో ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకొని 24 గంటల కరెంటు వస్తుందో లేదో తెలుస్తుందని కోమటిరెడ్డి, రేవంత్‌కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ఇచ్చింది ఉచిత కరెంటు కాదని, ఉత్తుత్తి కరెంట్‌ అని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్‌ గొంగడి మహేందర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మెన్‌ సందీప్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్‌, కల్లూరు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.